Share News

AP News: సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించనున్న కీలక అంశాలు ఇవే..

ABN , Publish Date - Jan 17 , 2025 | 07:16 AM

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.

AP News:  సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించనున్న కీలక అంశాలు ఇవే..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిపి.. నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషనకు సంబంధించిన కేబినెట్ ముందుకు ప్రతిపాదన.. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో 1.27 లక్షల మంది సచివాలయం ఉద్యో గులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయం.. ఒక సచివాలయంలో తక్కువ, మరో సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు దీనితో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి నిర్ణయం.. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూముల కేటాయింపులుపైన చర్చించనున్నారు.


సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ..

అలాగే సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై చర్చించే అవకాశముంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి.. కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా మంత్రులతో విడిగా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.


ఉక్కు కర్మాగారానికి ఊపిరి

తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ, ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఇది శుభవార్త.. సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం లభిస్తోంది. ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా... భారీ ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకువచ్చింది. విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం గురువారం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోసం శుక్రవారం కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామితో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు చర్చలు జరపనున్నారు. దీని తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్‌ప్లాంట్‌ను నడిపేందుకు సంబంధించిన విధివిధానాలను ఇరువురు మంత్రులు వెల్లడించే అవకాశాలున్నాయి.

ఫలించిన సీఎం చంద్రబాబు కృషి

సీఎం చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి, ప్రధాని మోదీని కలిసిన ప్రతి సందర్భంలో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు కూడా స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం కోరిన విషయం తెలిసిందే. ఈనెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి, ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని కోరారు. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ఇప్పటికే కుమారస్వామి కూడా వెల్లడించారు. ఈ వ్యవహారంలో కేంద్రం నుంచి అందించాల్సిన సహాకారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కూడా కుమారస్వామి చర్చలు జరిపినట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌ నష్టాలబాటలో వెళ్లకుండా సమర్థంగా నిర్వహించే విషయమై చంద్రబాబు ఒక బ్లూప్రింట్‌ను కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. ఆయన సూచనల మేరకు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధివిధానాలు ఏవిధంగా ఉంటాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


కూటమి వచ్చాక మారిన పరిస్థితి

విశాఖ స్టీల్‌ ప్లాంటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులకు 4నెలల నుంచి జీతాలు లేవు. కర్మాగారంలోని 3 బ్లాస్ట్‌ ఫర్నే్‌సల ద్వారా రోజుకు 21వేల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం 2బ్లాస్ట్‌ ఫర్నే్‌సలే పనిచేస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగక ఖర్చులు అధికమై నష్టాలు పెరుగుతున్నాయి. అప్పుల భారం పెరిగిపోతోంది. బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.17వేల కోట్లతో కలుపుకొని మొత్తం రూ.25వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొద్దినెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌ అభ్యర్థన మేరకు రెండు దఫాలుగా కేంద్రం రూ.1,650 కోట్ల ఆర్థిక సాయం చేసింది. వీటిని చట్టబద్ధమైన చెల్లింపులకు ఉపయోగించారు. ఇప్పుడు మరో రూ.11,500 కోట్ల ఆర్థిక సాయానికి కేంద్రం అంగీకరించగా.. దీనిలో రూ.10,500 కోట్లు ప్లాంట్‌కి నేరుగా ఆర్థిక ప్రయోజనం కింద, మరో రూ. వెయ్యి కోట్లు మరో రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయం పట్ల విశాఖ ఉక్కు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్యకర్తే అధినేత

వృద్ధుడి నుంచి రూ.10.90 లక్షలు కొల్లగొట్టారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 17 , 2025 | 07:16 AM