Share News

Inter Hall Tickets: వాట్సప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:41 AM

Inter Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ సర్కార్. ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లను వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Inter Hall Tickets: వాట్సప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా
AP Inter Hall Tickets

అమరావతి, ఫిబ్రవరి 7: దేశంలోనే తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో వాట్సప్‌ గవర్నెన్స్‌‌కు(WhatsApp Governance) శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం (AP Govt).. ప్రజలకు అవసమైన సమాచారాన్ని అందులో ఉంచుతోంది. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు (AP Intermediate exams) సంబంధించి కూడా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అని చెప్పుకోవచ్చు. వాట్సప్‌ గవర్నెన్స్‌లో ఇంటర్ హాల్ టికెట్లను అందించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈరోజు నుంచే ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.


వాట్సప్‌ నంబర్ 9552300009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. త్వరలోనే పదో తరగతి విద్యార్థులకు కూడా వాట్సప్‌లో హాల్‌ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.


ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలంటే..

  • ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కు హాయ్ (Hi) అని వాట్సప్‌లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.

  • దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.

  • అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి

  • అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్​లోడ్‌పై క్లిక్ చేయాలి.

  • ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్​ డౌన్​లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.

  • దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్​లోనే సింపుల్‌గా డౌన్​లోడ్ అవుతుంది.


కాగా.. ఫీజులు చెల్లించలేదని తదితర కారణాలతో పలు కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ చెక్‌ పెడుతూ ప్రభుత్వం వాట్సప్స్‌లో హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం పట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

హైడ్రా దూకుడు.. ఎయిర్ పోర్టు దగ్గర..

గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:23 PM