Vallabhaneni Vamsi: మిస్సైన వల్లభనేని వంశీ ఫోన్.. అసలు విషయం ఇదే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:29 PM
కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీని అరెస్టు చేస్తున్నప్పుడు అతని ఫోన్ అదృశ్యం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

విజయవాడ: వైసీపీ వివాదాస్పద నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అనేక నాటకీయ పరిణామాల నడుమ రోడ్డుమార్గాన విజయవాడకు వంశీని తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీసులు దాదాపు 8 గంటలపాటు మాజీ ఎమ్మెల్యేను విచారణ చేశారు. అయితే వంశీ నుంచి సరైన సమాధానాలు వారికి రాలేదు. ఆ తర్వాత విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో వంశీని హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు వంశీని తరలించారు.
అయితే వంశీని అరెస్టు చేస్తున్నప్పుడు అతని ఫోన్ అదృశ్యం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అందులోనే మెుత్తం డేటా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేత వంశీ నానా హంగామా చేశారు. అప్పుడే పోలీసుల కళ్లు గప్పి ఫోన్‌ను మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మెుబైల్ కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ గచ్చిబౌలి మైహోమ్ భూజాలోని వంశీ నివాసానికి రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో విజయవాడ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
వంశీ ఫోన్ ఎక్కడైనా దొరుకుతుందేమోనని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ మొబైల్‌లోనే కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ లేకుండా విజయవాడకు తిరిగి వెళ్లేది లేదని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటికే సేకరించారు. వంశీ ఫోన్ కూడా దొరికితే కీలక సమాచారం వెలుగులోకి రానుంది. అలాగే అతనిపై ఉన్న మరో 16 కేసులకు సంబంధించిన వివరాలు సైతం వెల్లడయ్యే అవకాశం ఉంది. అందుకే వంశీ తన ఫోన్‌ను మాయం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..
AP Politics: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. ఒక్కసారిగా 10 మంది కార్పొరేటర్లు జంప్..