AP News: కలకలం రేపుతున్న చిరుతల సంచారం.. బిక్కుబిక్కుమంటూ ఆ జిల్లాల ప్రజలు..
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:05 PM
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ రవికిరణ్ తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు స్థానికంగా ఉన్న కొండగట్టుపైకి వెళ్తుండగా.. అదే సమయంలో పులి తన పిల్లలతో రోడ్డు దాటుతుండడాన్ని కండక్టర్ గుర్తించాడు.
చిరుత కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన రవికిరణ్ విషయాన్ని వెంటనే ఆగిరిపల్లి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కండక్టర్ నుంచి పూర్తి వివరాలు సేకరించి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. మరోవైపు పెద్దపులి సంచరిస్తుందన్న వార్త మెట్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హడలెత్తిస్తోంది. పొలం పనులు, పక్క గ్రామాలకు వెళ్లాలన్నా సరే వణికిపోతున్నారు. ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు త్వరగా దాన్ని పట్టుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. చిరుతల సంచారంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలం పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి చేయకముందే దాన్ని పట్టుకుని తమ ప్రాణాలు రక్షించాలంటూ అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాంగ్రెస్ అంటేనే మోసంకు నిర్వచనం..
‘గృహజ్యోతి’తో పెరిగిన విద్యుత్ డిమాండ్
For More Andhra Pradesh News and Telugu News..