Minister Ravikumar: వైసీపీపై మంత్రి రవికుమార్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 09:28 PM
Minister Ravikumar: జగన్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

ప్రకాశం: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు బిగించాలని గత వైసీపీ ప్రభుత్వంలో పోరాటం చేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ నాయకులు గుండ్లకమ్మలో ఇసుక దోపిడీ చేసి గేట్లు విరగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.10 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ గేట్లు పెట్టామని చెప్పారు. గుండ్లకమ్మలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశామని వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో దోపిడీ పైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజల పట్ల బాధ్యతగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. తుంగభద్ర గేట్లు విరిగితే నిపుణుడు కన్నయ్యని తీసుకువచ్చి నీళ్లలోనే గేట్లు బిగించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
వైసీపీ హయాంలో వ్యవస్థలు దుర్వినియోగం..
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో నగదు అందించామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1600 కోట్లు బకాయిలు పెట్టి వదిలేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆ బకాయిలను మొత్తం చెల్లించిందని చెప్పారు. మిల్లర్స్ బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్స్ ఎవరు ఇవ్వడం లేదని అన్నారు. జగన్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై గుంతలు పూడ్చడానికి వేయి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశామని గుర్తుచేశారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీసిందని.. అందుకే 11 సీట్లకే పరిమితం అయిపోయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
ఆ ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదు: మంత్రి బాల వీరాంజనేయ స్వామి
గత జగన్ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని పంటలు నీళ్లు లేక ఎండిపోయాయన్నారు. కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టామని చెప్పుకొచ్చారు. రిజర్వాయర్లపై ఆధారపడిన మత్స్యకారుల కోసం గుండ్లకమ్మ ప్రాజెక్టులో 20 లక్షల 60 వేల చేప పిల్లలు వదిలిపెట్టామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.