Revenue Dept : పాఠం నేర్పని పాపాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:44 AM
రీ సర్వేకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి 3.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.

మళ్లీ రీ సర్వే పేరిట పాత తప్పులు.. నాడు జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు సర్వే
ఇష్టానుసారం భూరికార్డుల మార్పు
సర్వే చేసిన 8,680 గ్రామాల్లో 3.80 లక్షల మంది రైతులకు సమస్యలు
కూటమి సర్కారుకు ఫిర్యాదుల వెల్లువ
వాటిని పరిష్కరించకుండానే మళ్లీ రీ సర్వే
ఏకంగా 670 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు
ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, నిపుణుల విస్మయం
అనవసర ప్రయోగాలు అనర్థమని హెచ్చరిక
అవసరాన్ని బట్టే సర్వే చేయాలని సూచన
2019 జనవరి నాటికి ప్రభుత్వానికి 1.45 లక్షల ఫిర్యాదులు రాగా, ఇందులో రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవి కేవలం 13 వేలు. తాజాగా కూటమి సర్కారుకు 7.60 లక్షల ఫిర్యాదులు రాగా, అందులో ఒక్క రెవెన్యూవే 3.80 లక్షలు! ఇవన్నీ జగన్ సర్కారు చేసిన రీ సర్వే తప్పులే. వీటిని పరిష్కరించలేక కూటమి సర్కారు సతమతం అవుతూనే... తాను కూడా ‘రీసర్వే’ బాట పడుతోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం రీ సర్వే చేయించడానికి ముందు రాష్ట్రంలో భూ సమస్యలు కొన్ని వేలల్లో ఉంటే... రీ సర్వే తర్వాత కొత్త సమస్యలు లక్షల్లో పుట్టుకొచ్చాయి. అంటే.. ఉన్నవాటిని పరిష్కరించకుండా కొత్తగా ఎన్నో రెట్లు సృష్టించారు. రీ సర్వేకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి 3.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం దీన్నో గుణపాఠంగా తీసుకుని ఆ తప్పులు సరిదిద్దాల్సింది పోయి చిత్రంగా అదే తప్పు చేస్తోంది. జగన్ సర్కారు చూపిన రీ సర్వే బాటలోనే పయనిస్తోంది. నాడు ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపడితే... కూటమి సర్కారు ఏకంగా 670 గ్రామాల్లో చేస్తోంది. జగన్ జమానాలో రీ సర్వే చేసింది ఇప్పుడున్న రెవెన్యూ, సర్వే అధికారులు, సిబ్బందే. మళ్లీ ఇప్పుడు సర్వే చేస్తోంది కూడా వారే. మారిందల్లా ప్రభుత్వం మాత్రమే. పాత తప్పులు కళ్లెదురుగా పెట్టుకుని... కూటమి ప్రభుత్వం అదే పనిచేసి సాధించేదేమిటో? రెవెన్యూ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు తీసుకురాకుండా అదే అధికారులతో భూ వివాదాలు ఎలా పరిష్కరిస్తుంది? అన్నది సామాన్య రైతులు, నిపుణుల ప్రశ్న. జగన్ సర్కారు నిర్వాకం వల్ల రైతుల సమస్యలు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి రైతు సమస్యను పరిష్కరించాలంటే మళ్లీ సర్వే చేయాలి. కొలతలు వేశాక రైతులు ఆమోదించాలి. మళ్లీ చట్టబద్ధమైన వివిధ నోటిఫికేషన్లు ఇవ్వాలి. జగన్ రీసర్వే చేయించిన 8,680 గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కరించాలి. దీనికి ఎంత సమయం పడుతుందో.. ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయడం కష్టం. భూముల వద్దకు అధికారులను పంపించి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలి. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించకుండా జగన్ బాటలో రీ సర్వే చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది.
వెంటాడుతున్న జగన్ తప్పులు: గత జగన్ సర్కారు కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. 1500 ఎకరాలున్న చిన్న గ్రామంలోనే విజయం సాధించలేకపోయారు. అయినా తర్వాత 8,680 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయించారు. 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా భూ వివాదాలు సృష్టించారు. దాని ప్రభావం వైసీపీ సర్కారుపై గట్టిగానే పడింది. రైతుల సమస్యలను గ్రహించిన టీడీపీ అధికారంలోకి వస్తే భూ వివాదాలు తీరుస్తామని చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... గతంలో రీసర్వే చేపట్టిన 8,680 గ్రామాల్లో సభలు నిర్వహిస్తే 2.60 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో మరో 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో 7.60 లక్షల ఫిర్యాదులు అందాయి. అందులో ఒక్క రీ సర్వేపై వచ్చినవే 3.80లక్షలు ఉన్నాయి. అంటే.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రజాసమస్యల్లో సింహభాగం జగన్ సర్కారు చేసిన తప్పిదాలతో వ చ్చినవే. నాలుగైదు నెలల్లోనే 80శాతం ఫిర్యాదులు పరిష్కారించామని రెవెన్యూ శాఖ చెబుతోంది. అయితే నిజంగా సమస్యలను పరిష్కరిస్తే రైతులు మళ్లీ ఎందుకు ఫిర్యాదు చేస్తారన్నది ప్రశ్న. రెవెన్యూ అధికారుల డొల్ల నివేదికపై నిపుణులు, చట్టాలు, విధానాలపై అవగాహన ఉన్నవారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్కారుకు ఏమాత్రం సందేహం రాకపోవడం విచిత్రం.
రీ సర్వే ఆపేసి.. మళ్లీ ప్రారంభం
ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే క్షేత్రస్థాయిలో పనిచేసేది అధికారులనే ప్రభుత్వం నమ్మాలి. జగన్ ప్రభుత్వం అధికారులను నమ్ముకొని సర్వేను స్వకార్యంగా మార్చుకుంది. మాటవినని రాజకీయ ప్రత్యర్థులు, పేద రైతులు, సామాన్యుల భూ రికార్డులను తారుమారు చేశారు. జగన్ సర్కారు నిర్వాకం వల్ల లక్షలాది మంది బాధితులుగా మారారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఈ సమస్యలన్నీ తెలుసు. జగన్ సర్కారు రీ సర్వే పేరిట దారుణాలు చేసిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రీసర్వేను, పాసుపుస్తకాలను ఆపేశారు. సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలను తొలగిస్తున్నారు. కానీ అధికారులు చెప్పారంటూ మళ్లీ రీసర్వే ప్రారంభించారు. 670 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అంటే... పాత సమస్యలు పరిష్కరించకుండా, మళ్లీ రీ సర్వే పేరిట కొత్తగా లక్షల సమస్యలు సృష్టించేందుకు సిద్ధమయ్యారా? ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా? అన్న అనుమానాలు సగటు రైతు నుంచి వ్యక్తమవుతున్నాయి.
మోదీని చూసి నేర్చుకోవాలి
గతంలో గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీ సర్వే చేపట్టాక, తప్పని తెలుసుకొని ప్రాజెక్టును రద్దు చేశారు. అనంతరం సీఎంగా గెలిచారు. ప్రధాని హోదాలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన తర్వాత తప్పు తెలుసుకొని వాటిని రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. వీటి నుంచి కూటమి ప్రభుత్వం ఎందుకు గుణపాఠాలు నేర్చుకోదు? ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రీ సర్వే పేరిట మళ్లీ కొత్త సమస్యలు రావాలని కోరుకోవడం లేదు. అయినా రీ సర్వే చేయాలని ప్రభుత్వం ఎందుకు ఆరాటపడుతోంది? అధికారుల మాట నమ్మితే సీఎం రైతు వ్యతిరేకత మూటగట్టుకుంటారు.
- రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు
బలవంతంగా రుద్దొద్దు
జగన్ సర్కారు ప్రారంభించిన రీసర్వే రైతులకు సమస్యలు తీసుకొచ్చింది. అందుకే 2019 తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగని భూములకు సంబంధించి పాత రికార్డులను పునరుద్ధరించాలి. సర్వే, సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి. అంతేకానీ, ఎవరూ కోరని రీ సర్వేను రైతులపై బలవంతంగా రుద్దొద్దు.
- రెవెన్యూ నిపుణుడు రామయ్య