APSRTC : ఆర్టీసీకి 20 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:01 AM
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.20కోట్లకు పైగా వచ్చిందని ఆ సంస్థ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.

త్వరలో వెయ్యి ఎలక్ర్టికల్ బస్సులు
ఎండీ ద్వారకా తిరుమలరావు
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.20కోట్లకు పైగా వచ్చిందని ఆ సంస్థ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్, గ్యారేజీని సోమవారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సంక్రాంతికి ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున నడపడం ద్వారా గతేడాది కూడా రూ.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ప్రత్యేక చార్జీలు వసూలు చేయకుండానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం సంతోషకరం. మంచి ఎఫర్ట్ పెట్టిన ఆర్టీసీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగులు, సిబ్బందిని అభినందిస్తున్నా. ఆర్టీసీ ఉద్యోగులకు ఎరియర్స్‌ను ఇప్పటికే కొంత చెల్లించాం. మిగిలిన బకాయిల్లో 25 శాతం వారం రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 1,500 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయగా మరో వెయ్యి ఎలక్ర్టికల్ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటులో నిబంధనలను పాటిస్తాం’ అని అన్నారు. ఈ సందర్భంగా గ్యారేజీ ఆవరణలో మొక్కను నాటారు.