Land Dispute : స్వమిత్వలో సర్వేయర్ల చేతివాటం
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:22 AM
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు వెలకట్టడకపోవడం, ఆస్తులు కలిగి ఉన్నా సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఉంది.

ప్రాపర్టీ కార్డులకు భారీగా లంచం డిమాండ్
గోదావరి, కృష్ణా జిల్లాల్లో పెద్దమొత్తంలో వసూళ్ల పర్వం
అందినంత దండుకుంటున్న సిబ్బంది
కేంద్ర పథకానికి తూట్లు
అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): దేశంలో గ్రామీణ పౌరులకు సంబంధించిన ఆస్తుల విలువను ధ్రువీకరించి వారికి మేలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తికి రాష్ట్రంలో కొంతమంది సర్వేయర్లు తూట్లు పొడుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు వెలకట్టడకపోవడం, ఆస్తులు కలిగి ఉన్నా సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఉంది. ఈ కారణాలతోనే గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. అందుకే ప్రభుత్వమే గ్రామాల్లో ఉన్న ప్రతి ఆస్తిని గుర్తించి, దాని విలువను లెక్కించి దాని యజమానికి హక్కులు కల్పించేందుకు స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకం ప్రవేశపెట్టంది. ఆ పథకం ద్వారా ప్రాపర్టీ కార్డును జారీచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతమైన డ్రోన్ టెక్నాలజీని వినియోగించి భూములను సర్వే చేసి, మ్యాపింగ్ చేస్తారు. ఈ కార్డుల ఆధారంగా ప్రజలు బ్యాంకు రుణాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. ప్రజల ఆస్తులే కాకుండా గ్రామాల్లో ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను కూడా గుర్తిస్తారు.
సర్వేయర్ల బెదిరింపు
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ స్వమిత్వ పథకాన్ని నిర్వహిస్తున్నప్పటికీ గ్రామాల్లో సర్వేయర్లు పెత్తనం ఎక్కువగా ఉంది. వారిని నియంత్రించేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు నేరుగా అధికారం లేకపోవడంతో సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే భూముల ధ్రువీకరణలో గ్రామాల్లో సర్వేయర్లు రైతులు, ప్రజలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము కోరినంత ముట్టజెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులివ్వకపోతే ఆ భూమి ప్రభుత్వానిదేనని రికార్డుల్లో చూపిస్తామని బెదిరిస్తున్నారు. సర్వేయర్ల ఆగడాలకు గ్రామీణులు బెంబేలెత్తుతున్నారు. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న ఆస్తులు పోగొట్టుకోలేక అప్పో సొప్పో చేసి లంచం ముట్టచెప్పి తమకు అనుకూలంగా స్వమిత్వ పత్రాలను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో స్థలాల విలువ అధికంగా ఉండటంతో అక్కడ సర్వేయర్లు భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు, పథకాలు పేదలకు ఉపయోగకరంగా ఉండాలని, కానీ ప్రతి పనికీ రేట్ నిర్ణయించే కొంత మంది ఉద్యోగుల వల్ల పథకం నీరుగారిపోతోందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లోనూ దోపిడీ
కొన్నిచోట్ల పంచాయతీ, గ్రామకంఠం భూములను సర్వేయర్లు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ వారినుంచి భారీగా దండుకుంటున్నారు. స్వమిత్వ ద్వారా పంచాయతీల ఆస్తులకు రక్షణ కలుగుతుందని భావిస్తుంటే.. సర్వేయర్ల నిర్వాకంతో వాటికి ముప్పు ఏర్పడిందని పంచాయతీల సిబ్బంది చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొంతమంది ప్రభుత్వ అధికారుల నుంచి కూడా ఈ సర్వేయర్లు లంచం వసూలు చేశారు. ప్రభుత్వం ఇకనైనా సర్వేయర్ల లంచాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News