Share News

AP Women: చిత్రహింసలకు గురిచేస్తున్నారు... కువైట్‌లో మరో తెలుగు మహిళ ఆవేదన

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:07 PM

Woman trapped in Kuwait: పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఏపీ మహిళ ఒకరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టిన ఏజెంట్ సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో..ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.

AP Women: చిత్రహింసలకు గురిచేస్తున్నారు...  కువైట్‌లో మరో తెలుగు మహిళ ఆవేదన
Woman trapped in Kuwait

కాకినాడ: ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని చేసే చోట ఇబ్బందులు పడుతున్న మహిళ తనను కాపాడాలని వేడుకుంటున్న ఓ సెల్ఫీ వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లి పని ప్రదేశంలో తాను పడుతున్న ఇబ్బందులను బాధితురాలు తెలిపింది. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం కువైట్‌కు వెళ్లిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది 'నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు.. కాపాడండి' అంటూ వీడియోలో వాపోయింది. చాలీచాలని జీతాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవుల కష్టాల కడలి నుంచి గట్టెక్కడానికి ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌‌ చేస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాకు చెందిన మహిళ వీడియో అందరినీ కదిలిస్తోంది.


గదిలో బంధించి..

బతుకుదెరువునకు కువైట్ వెళ్లిన ఓ మహిళకు అగచాట్లు తప్పలేదు. తనను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఏజెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపింది. తనను కువైట్ తీసుకెళ్లిన ఏజెంట్ పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్‌ చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ ఆ మహిళ వీడియో విడుదల చేసింది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అమ్ములు ఆరు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఇళ్లలో పని చేసేందుకు ఓ ఏజెంట్ బాధితురాలని నియమించాడు. అక్కడ ఇళ్లలో పరిమితికి మించి పనులు చెప్పడంతో బాధిత మహిళ ఆ పనులు చేయలేకపోయింది. పనిలో నుంచి తీసేసి రూ.2 లక్షలు కట్టే వరకు వదిలేది లేదని ఆ ఏజెంట్ గదిలో బంధించాడు. తన పరిస్థితిని వివరిస్తూ కాకినాడ జిల్లా ఉప్పాడలోని తన కోడలు దుర్గకు ఆ మహిళ వీడియో పంపించింది. ఈ వీడియో చూసిన వారు బంధుమిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళను స్వదేశానికి తీసుకు వచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


మోసగిస్తున్న ఏజెంట్లు..

గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మరికొందరేమో పని ప్రదేశంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధి పేరుతో ఆయా దేశాలకు తీసుకెళ్లిన తర్వాత పని ఇప్పించకపోవడం, లేదా ఎవరూ చేయలేని అతికష్టమైన పనులను అప్పగిస్తూ బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కువైట్, మస్కట్, సౌదీ వెళ్లి అక్కడ మోసపోయి.. దేశం కాని దేశంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, ఉపాధికోసం కువైట్‌కు వెళ్లి.. అక్కడ నరకయాతన అనుభవిస్తోన్న కొంతమంది బాధితులను ఏపీ ప్రభుత్వం క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అలాగే కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అమ్ములు అనే మహిళ కూడా పనిచేసే చోట తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో ద్వారా వివరించింది. స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని వీడియోలో వేడుకుంది. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు ఎడారిలో తమ కష్టాలను వివరిస్తూ రక్షించాలని వేడుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

MLC Nominations : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నాలుగు నామినేషన్లు

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 08 , 2025 | 12:14 PM