Sri sathya sai District : వైసీపీ నేత చెరలో తమిళ కూలీలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:12 AM
పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు.

మూడేళ్లుగా నిర్బంధం.. దంపతులతో తోటలో వెట్టి చాకిరి
స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆర్డీవోకు బాధితుల ఫిర్యాదు
క్షేమంగా స్వస్థలానికి పంపించిన అధికారులు
కేశవరెడ్డిపై కేసు నమోదు.. శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
ధర్మవరం రూరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు. మూడేళ్ల పాటు తన చీనీ తోటలో నిర్బంధించి.. తక్కువ కూలీకి వెట్టిచాకిరి చేయించుకున్నాడు. స్వస్థలానికి వెళతామన్నా అనుమతించలేదు. బయటకు చెబితే ఏమవుతుందోనని భయపడిన ఆ బాధితులు.. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఎట్టకేలకు బయటపడ్డారు. రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యం చేసుకుని, ఆ దంపతులను వారి స్వస్థలానికి సురక్షితంగా పంపించారు. శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ధర్మవరం మండలం బడన్నపల్లికి చెందిన వైసీపీ నేత బడన్నపల్లి కేశవరెడ్డి మూడేళ్ల క్రితం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా కార్తికేయపురానికి చెందిన పళని, దేవయాని దంపతులను తన చీనీ తోటలో పనికి కుదుర్చుకున్నాడు. బయటకు వెళ్లేందుకు వీల్లేకుండా తోటకే పరిమితం చేశాడు. తక్కువ కూలీ ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడ్డాడు. పని వదిలి వెళ్లకుండా అగ్రిమెంట్ చేసుకుని, బానిసలుగా మార్చుకున్నాడు. స్థానికేతరులు కావడంతో బాధిత దంపతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. స్వగ్రామానికి వెళ్లి వస్తామన్నా.. అనుమతించలేదు.
దిక్కుతోచని స్థితిలో తమ బంధువుల సాయంతో జిల్లాలోని రెడ్స్ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. వారు ఈ విషయాన్ని ఈ నెల 12న ధర్మవరం ఆర్డీవో మహేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో విచారణకు ఆదేశించడంతో వీఆర్వో విష్ణువర్ధన్.. కేశవరెడ్డి తోటకు వెళ్లి ఆ దంపతులను విచారించారు. వారిని ఆర్డీవో వద్దకు తీసుకెళ్లారు. అనంతరం పోలీసు భద్రతతో వీఆర్వో వారి స్వస్థలానికి తీసుకువెళ్లారు. తిరుత్తణి రెవెన్యూ అధికారులకు శుక్రవారం అప్పగించారు. ధర్మవరం రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కేశవరెడ్డిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కేశవరెడ్డి.. దంపతులు తన వద్ద అడ్వాన్స్ తీసుకుని పనులు వచ్చారని చెప్పినట్లు సమాచారం. వారికి ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించానని చూపించినట్లు తెలిసింది. కూలీలను నిర్బంధించడం, బెదిరించడం, తక్కువ కూలీ చెల్లించడం కార్మిక చట్టాల ప్రకారం నేరమని, కేశవరెడ్డిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి