YSRCP Leaders : జగన్.. ఏమిటిది!!
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:32 AM
తమ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీరుపై వైసీపీ ముఖ్య నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా ఆందోళనలు చేపట్టాలని ఆదేశించడాన్ని తప్పుబడుతున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఫీజులపై ఆందోళనలా?
రీయింబర్స్‌మెంట్ బకాయిలు 800 కోట్లు చెల్లించాక ధర్నాలంటే ఎలా?
వైసీపీ నేతల్లో అసంతృప్తి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తమ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీరుపై వైసీపీ ముఖ్య నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా ఆందోళనలు చేపట్టాలని ఆదేశించడాన్ని తప్పుబడుతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటూ ఈ నెల ఐదో తేదీన ‘ఫీజు పోరు’ జరపాలని పిలుపివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండానే.. రైతు పోరు, విద్యుత్ చార్జీల పోరు నిర్వహించాలని ఆదేశించారని.. ఈ రెండు కార్యక్రమాలకూ రైతుల నుంచి, ప్రజల నుంచి ఏ మాత్రం మద్దతు రాలేదని గుర్తుచేస్తున్నారు. అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయని.. ఇప్పుడు ఫీజు పోరుకూ అదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు. జగన్ జమానాలో చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన విద్యాదీవెన బకాయిల్లో రూ.800 కోట్లను కూటమి ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ సమయంలో ధర్నాలు చేయడం సముచితంగా ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వరుసగా విఫలమవుతుంటే.. అందుకు కారణాలు తెలుసుకోకుండా మొండిగా ఇంకొన్ని చేపట్టాలనడం తగదని చెబుతున్నారు. ఇచ్చిన హామీలను మన హయాంలో ఎలా అమలు చేశారో ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రస్తావిస్తున్నారు. 2019 మే నెలాఖరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. 2020 జనవరిదాకా సంక్షేమ హామీలను అమలు చేయలేదు. విద్యాదీవెన పథకాన్ని ఏకంగా ఒక ఏడాది ఎగవేశారు. ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లలో మాత్రమే సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేశారు. చివరి ఏడాది బటన్ నొక్కుతానంటూ షెడ్యూల్‌ను ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వచ్చిందంటూ చేతులెత్తేశారు. ఇప్పుడేమో.. తాను ఓడిపోవడం వల్లే జనాలకు సంక్షేమం అందడం లేదని ప్రచారం చేసుకుంటున్నారు.
జనంలోకి ఎప్పుడో!
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక.. అందుకు కారణాలేంటో నాయకులతో జగన్ చర్చించలేదు. ప్రజల్లోకి కూడా వెళ్లలేదు. అనుకూల మీడియా ముందు.. తానుంటే ఇలా జరిగేది.. అలా జరిగేదని చెబుతూ వస్తున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని.. లోక్‌సభా నియోజకవర్గాల వారీగా మూడు రోజుల చొప్పున బస చేస్తానని గతంలో ఆయన ప్రకటించారు. కానీ తన కుమార్తె కాలేజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీసమేతంగా లండన్ వెళ్లారు. 4వ తేదీన తాడేపల్లి ప్యాలె్‌సలో జరిగే పార్టీ నేతల సమావేశంలో జనంలోకి ఎప్పుడు వెళ్తారో షెడ్యూల్ ప్రకటిస్తారని చెబుతున్నా.. వైసీపీ నేతలకు నమ్మకం కుదరడం లేదు. ఇంకోవైపు.. జగన్ లండన్‌లో ఉండగానే.. ఆయనకు కుడిభుజంలా మెలిగిన విజయసాయిరెడ్డి రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని లండన్ పర్యటనలో ఉన్న జగన్‌కు స్వయంగా ఫోన్ చేసి చెప్పానని ప్రకటించారు కూడా. ఈ పరిణామంపై జగన్ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. కానీ విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తున్నట్లు వైసీపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News