కాళ్లకి మబ్బులు మొలిచి నింగిలో తేలిన హాయి!
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:31 AM
‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు’’ – ఇది నా మొదటి కవిత, ఆంధ్రజ్యోతిలో అచ్చయ్యింది. అచ్చులో తొలిసారి నా పేరు చూసుకున్న ఆశ్చర్యం ఆనందం...

నా మొదటి పుస్తకం
‘‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు’’ – ఇది నా మొదటి కవిత, ఆంధ్రజ్యోతిలో అచ్చయ్యింది. అచ్చులో తొలిసారి నా పేరు చూసుకున్న ఆశ్చర్యం ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంబరంలో ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చే దుకాణాలకీ లైబ్రరీలకీ ఇళ్లకీ సైకిల్ మీద రయ్యిమంటూ పోయి, అక్కడి పేపర్లో కూడా నా పేరు ఉందని ఆశ్చర్యపోయి, మురిసి పోయాను. అమలాపురం ఊరంతా తోరణాలు కట్టినంత పని చేశాను. 1980లో అలా మొదలయ్యింది నా జర్నీ. నా కవితలు ఎక్కువగా ఆంధ్రజ్యోతి, ప్రజాసాహితి పత్రికల్లో వచ్చాయి. పుస్తక రూపంలో రాకముందే సంచార కవి పెమ్మ రాజు గోపాలకృష్ణ ద్వారా పొయెట్రీ సర్కిల్స్ లోకి వెళ్లిపో యాయి. నా సమకాలికుల పుస్తకాలు ఒక్కటొక్కటే వస్తు న్నాయి. నాకు టెన్షన్ మొదలయ్యింది. పుస్తకం వెయ్యాలి, కానీ డబ్బుల్లేవు. వాసిరెడ్డి నవీన్ సొంత డబ్బుతో ‘లోహనది’ పుస్తకం అచ్చు వేశాడు. డబ్బు దగ్గర నుండి, శివారెడ్డి గారిచేత ముందు మాట రాయించడం, శీలావీర్రాజు గారి చేత కవర్ పేజీ బొమ్మవేయిం చడం, ప్రెస్సు వాళ్లతో మాట్లాడ్డం మొదలైన నొప్పులన్నీ తనే పడ్డాడు. అంచేత నాకు నొప్పి తెలియలేదు. ‘లోహనది’ లో కవిత్వం నచ్చిన శీలా వీర్రాజుగారు కూడా మిగతావాటికి భిన్నంగా అధివాస్తవిక ముఖచిత్రం వేసి ఇచ్చారు. హ్యాండ్ కంపో జింగ్. ‘ఝరీ’ పొయెట్రీ సర్కిల్ తరపున 1989 ఆగస్టులో పుస్తకం వచ్చింది. వెల పది రూపాయలు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రెరీలో పోలీసు, సిఆర్పీ దళాల పహరాలో కిక్కిరిసిన జనం మధ్య పుస్తకా విష్కరణ జరిగింది. జైలు నుండి విడుదలైన వరవరరావు గారు పాల్గొన్న మొదటి సమావేశం అది. కారా మాస్టారు పుస్తకం ఆవిష్కరించారు. దేవిప్రియ అధ్యక్షుడు. వివి, శివారెడ్డి ప్రధాన వక్తలు. పెమ్మరాజు గోపాలకృష్ణకు అంకితం ఇచ్చాను. ఆయన తొలి ప్రతి స్వీక రించారు. పుస్తకం మొదటి కాపీల కట్ట విప్పి పుస్తకం చూసిన వెంటనే తీవ్రభావోద్వేగానికి గురయ్యాను. పుస్తకాల్ని కాసేపు గుండెకు హత్తుకుని ఉంచుకున్నాను.
సభలో వివి అద్భుతంగా మాట్లాడారు. సభానంతరం ఆటోగ్రాఫులు ఇవ్వడం, పుస్తకాల మీద సంతకం చేసి ఇవ్వడం గొప్ప సంతోషం. పుస్తకానికి మంచి స్పందన లభించింది. ప్రగతిశీల శిబిరాలు ఇందులో కవిత్వాన్ని ఓన్ చేసుకున్నాయి. వసీరా ఏం చెప్పినా కవిత్వమే చెప్పాడంటూ చేకూరి రామారావు ఆంధ్రజ్యోతిలో ‘చేరాతలు’ కాలమ్‌లో రాశారు. ప్రసవం తర్వాత బిడ్డ అంద చందాలని గుణగణాల్నీ పదిమందీ మెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. నిప్పుల్ని మింగి, ఎన్నో నొప్పుల్ని భరించి కవితలు రాసిన బాధంతా మర్చిపోయి, ఒక్కసారి కాళ్లకి మబ్బులు మొలిచి నింగిలో తేలిన హాయి. ‘లోహనది’కి గరికపాటి, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు వచ్చాయి. ఆ డబ్బుతో వాసిరెడ్డి నవీన్ బాకీ తీర్చేశా. కానీ ఇప్పటికీ రుణపడే ఉన్నాను. దాదాపు 30ఏళ్ల తర్వాత ‘లోహనది’లో కవితలు ఇప్పటికీ రిలవెంట్ అని భావించి మిత్రులు శ్వేత యర్రం, మల్లికార్జున్ తమ అజు పబ్లికేషన్స్ నుండి రీప్రింటు వేశారు. 80 దశకాన్ని రిప్రజెంట్ చేసే కవిత్వ పుస్తకాల్లో ‘లోహనది’ ఒకటి కావడం, ఇప్పటి వారికీ బాగా నచ్చడం సంతోషకరం.
వసీరా