Share News

Joe Biden: మాదక ద్రవ్యాల కేసులో 2500 మందికి క్షమాభిక్ష!

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:13 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో రెండు రోజుల్లో తన పదవిని వదులకోనున్నారు.

Joe Biden: మాదక ద్రవ్యాల కేసులో 2500 మందికి క్షమాభిక్ష!

ఒక్క రోజులో బైడెన్‌ నిర్ణయం

భారీ సంఖ్యలో క్షమాభిక్షలు

ప్రసాదించిన అధ్యక్షుడిగా రికార్డు

వాషింగ్టన్‌, జనవరి 17: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో రెండు రోజుల్లో తన పదవిని వదులకోనున్నారు. నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న శ్వేత సౌధంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే.. ఈ చివరి రోజుల్లో అధ్యక్షుడు బైడెన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా క్షమాభిక్షలు, తీవ్ర నేరాల్లో శిక్షలు పడిన వారికి ఆయా శిక్షల తగ్గింపు వంటి నిర్ణయాలతో రికార్డు సృష్టించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న 2500 మందికి శుక్రవారం ఒకే ఒక్క రోజులో ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. అధ్యక్షుడిగా తనకు ఉండే క్షమాభిక్ష అధికారాలను వినియోగించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్‌ తెలిపారు. తాజా నిర్ణయంతో అమెరికా అధ్యక్షులుగా చేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరూ ప్రసాదించని క్షమాభిక్షలు, శిక్ష తగ్గింపులు చేసిన అధ్యక్షుడిగా బైడెన్‌ రికార్డు సృష్టించినట్టు అయింది. చరిత్రాత్మక తప్పులను, శిక్షల అసమానతలను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. కాగా, ఈ 2500 మంది పేర్లను అధ్యక్ష భవనం వెల్లడించలేదు. అదేవిధంగా సోమవారం(ఈ నెల 20)లోగా మరిన్ని క్షమాభిక్షలు ప్రసాదించేందుకు, శిక్షలు తగ్గించేందుకు తన ప్రయత్నం కొనసాగుతుందని వెల్లడించారు. ఇదిలావుంటే, కరోనా సమయంలో శిక్షలు పడిన, గృహ నిర్బంధంలో ఉన్న 1500 మంది శిక్షలను బైడెన్‌ గత నెలలో తగ్గించారు.

గతంలో ట్రంప్‌ కూడా..

గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తన పదవి నుంచి దిగిపోయే చిట్టచివరి రోజు అర్థరాత్రి 140 మందికి సంబంధించిన శిక్షలను తగ్గించే లేదా క్షమాభిక్షలు ప్రసాదించే ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

Updated Date - Jan 18 , 2025 | 05:13 AM