Share News

Maoist encounter: అడవిలో నెత్తుటేర్లు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:05 AM

ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో గ్రనేడ్‌ లాంచర్లతో మావోయిస్టుల దాడులు.. అధునాతన ఆయుధాలతో జవాన్ల ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

Maoist encounter: అడవిలో నెత్తుటేర్లు!

ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 31 మంది నక్సల్స్‌ మృతి.. వారిలో 11 మంది మహిళలు

మృతుల్లో పలువురు అగ్ర నేతలు ఉన్నట్లు సందేహాలు

తెలుగువారు భాస్కర్‌, ప్రకాశ్‌ కూడా ఉన్నట్లు ప్రచారం

ఇద్దరు జవాన్ల మృతి.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో కాల్పులు

ఇంద్రావతి జాతీయ పార్క్‌లో 3 రాష్ట్రాల నక్సల్స్‌ సమావేశం

చుట్టుముట్టిన 650 మంది జవాన్లు.. గంటలపాటు కాల్పులు

నక్సల్స్‌కు భారీ నష్టం.. 2 నెలల్లో 81 మంది హతం

చర్ల/చింతూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతం నెత్తురోడింది. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో గ్రనేడ్‌ లాంచర్లతో మావోయిస్టుల దాడులు.. అధునాతన ఆయుధాలతో జవాన్ల ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆదివారం రాత్రి కడపటి వార్తలందేసరికి.. 31 మంది మావోయిస్టుల మృతదేహాలు.. పెద్ద సంఖ్యలో ఏకే-47, ఇతర తుపాకులు లభ్యమయ్యాయి. 15 మృతదేహాల వద్ద ఏకే-47, ఆటోమేటెడ్‌ గన్స్‌ లభించడంతో.. వారంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన డివిజనల్‌, స్టేట్‌, సెంట్రల్‌ కమిటీకి చెందిన నేతలు/సభ్యులు అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్‌ ఐజీ సుందర్‌దాస్‌ కథనం ప్రకారం.. నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మూడు రాష్ట్రాల మావోయిస్టులు సమావేశమైనట్లు ఉప్పందుకున్న డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా బలగాలు.. ఆదివారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్‌ ప్రారంభించాయి. 650 మంది కూంబింగ్‌లో పాల్గొనగా.. ఉదయం 8 గంటలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో.. రెండు వైపులా కాల్పులు మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి 12 మంది నక్సల్స్‌ మృతిచెందగా.. సాయంత్రానికి ఆ సంఖ్య 31కి చేరింది. వారిలో 11 మంది మహిళలు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు జవాన్లు-డీఆర్జీ హెడ్‌కానిస్టేబుల్‌ నరేశ్‌ధ్రువ, ఎస్టీఎఫ్‌ కానిస్టేబుళ్లు వసిత్‌ రౌతే, గులాబ్‌ మాండవి, డీఆర్జీ కానిస్టేబుల్‌ జగ్గు కల్ము తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించగా.. నరేశ్‌ధ్రువ, వసిత్‌ రౌతే చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగతా ఇద్దరు జవాన్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.

GF.jpg


ఒకేచోట.. 3 రాష్ట్రాల నక్సల్స్‌

గడిచిన ఏడాది కాలంగా వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టుల తరఫున భారీ నష్టం వాటిల్లింది. దీంతో.. ఉన్న క్యాడర్‌ను కాపాడుకుంటూ.. పునర్నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర(గడ్చిరోలి కమిటీ), ఛత్తీ్‌సగఢ్‌(నేషనల్‌ పార్క్‌ కమిటీ, మద్దేడు కమిటీ)కు చెందిన మావోయిస్టులు నేషనల్‌ పార్క్‌లో సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీ్‌సగఢ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. వీరు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రాష్ట్రంలో పలు పంచాయతీలతో పాటు.. రాజధాని నగరం రాయ్‌పూర్‌ మునిసిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి వ్యూహాత్మకంగా నక్సల్స్‌ను చుట్టుముట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 650 మంది జవాన్లతో నాలుగు వైపుల నుంచి కూంబింగ్‌ ప్రారంభించారు. ఉదయం 8 గంటల సమయంలో నక్సల్స్‌ తారసపడడంతో.. ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరిగాయి. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పెచ్చర్లకు చెందిన అడెల్లు అలియాస్‌ భాస్కర్‌, మందమర్రికి చెందిన ప్రశాశ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, గతేడాది నుంచి మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. 2024లో 219 మంది నక్సల్స్‌ చనిపోగా.. వెయ్యి మంది వరకు లొంగిపోయారు. ఈ ఏడాది కూడా నేషనల్‌ పార్క్‌ ఎన్‌కౌంటర్‌తో కలిపి.. గడిచిన 40 రోజుల్లో మొత్తం 81 మంది నక్సలైట్లు మృతిచెందారు. గరియాబంద్‌లో 16, గంగలూరులో 8, పూజారి కాంకేర్‌లో 12 మంది నక్సల్స్‌ హతమయ్యారు.

h.jpg


2026కల్లా నక్సలిజం అంతం: షా

దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత.. దేశంలో నక్సలిజం వల్ల ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు కూడా పోకూడదని ఆకాంక్షించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:05 AM