కేజ్రీవాల్‌పై దాడికి ‘ఖలిస్థాన్’ కుట్ర
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:23 AM
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై దాడికి ఖలిస్థాన్ అనుకూల సంస్థ కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
నిఘా వర్గాల నివేదిక.. న్యూఢిల్లీ నుంచి కేజ్రీ నామినేషన్
న్యూఢిల్లీ, జనవరి 15: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై దాడికి ఖలిస్థాన్ అనుకూల సంస్థ కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి. దీనిపై బుధవారం కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే తనను కాపాడతాడని, జీవనరేఖ ఉన్నంత కాలం తాను జీవిస్తానని పేర్కొన్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయనున్న కేజ్రీవాల్ బుధవారం తన నామినేషన్‌ను సమర్పించారు.
నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు ఆయన కన్నాట్‌ప్లే్‌సలోని ప్రాచీన హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. కేజ్రీవాల్ ప్రాణానికి ముప్పున్నట్టు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ భద్రత ఉంది. పైలట్, ఎస్కార్ట్ టీమ్, తనిఖీ యూనిట్లతో సహా మొత్తంగా 63 మంది ఆయనకు రక్షణగా ఉంటారు.