Share News

Movie theaters: ‘తెర’మరుగవుతున్నాయి.. కాలగర్భంలో కలిసిపోతున్న థియేటర్లు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:12 AM

కూలి పనులు చేసే నిరుపేద నుంచి ధనవంతుల వరకు అందరికీ సరిసమానమైన వినోదాన్ని పంచిపెట్టిన ప్రాంతాలే సినిమా థియేటర్లు(Movie theaters). వెండితెరపై హీరో హీరోయిన్ల ఆటలు పాటలు, నవరసాలను చూసి ఆనందించడానికి ప్రేక్షజనం గుమికూడే ప్రాంతాలే సినిమా థియేటర్లు.

Movie theaters: ‘తెర’మరుగవుతున్నాయి.. కాలగర్భంలో కలిసిపోతున్న థియేటర్లు

- గోదాములుగా మారిన సినిమా హాళ్లు

చెన్నై: కూలి పనులు చేసే నిరుపేద నుంచి ధనవంతుల వరకు అందరికీ సరిసమానమైన వినోదాన్ని పంచిపెట్టిన ప్రాంతాలే సినిమా థియేటర్లు(Movie theaters). వెండితెరపై హీరో హీరోయిన్ల ఆటలు పాటలు, నవరసాలను చూసి ఆనందించడానికి ప్రేక్షజనం గుమికూడే ప్రాంతాలే సినిమా థియేటర్లు. నేటి మొబైల్‌ఫోన్ల యుగంలో అరచేతిలోనే ఇమిడిపోయిన సెల్‌ఫోన్‌లో చూసినా, ఈలలు వేసుకుంటూ, చప్పట్లు చరచుకుంటూ థియేటర్లలో చూసే ఆనందాన్ని ఏ పరికరమూ ఇవ్వలేవు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: వర్సిటీలో ఆ రోజు రాత్రి ఏం జరిగింది..


సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవడం, ఫిలిమ్‌ రీళ్లకు తావులేకుండా డిజిటల్‌ సాంకేతిక సదుపాయంతో సినిమాలు తీయటం సులువై వారానికి పది పదిహేను సినిమాలు వాటి టైటిల్స్‌ తేటతెలుగు భాషలో పెట్టడానికి కూడా పేర్ల కొరత ఏర్పడి ఆంగ్లంలో పేర్లుపెట్టి మరీ విడుదల చేయాల్సిన దౌర్భాగ్యస్థితి కొనసాగుతోంది. కాలగమనంలో వచ్చిన ఈ మార్పులే యేడాదికి పది పదిహేను సినిమాలు ప్రదర్శించి, వాటిలో రెండు మూడు పేరున్న హీరోల సినిమాలు వందరోజులాడి భారీగా వచ్చిన కలెక్షన్లతో జోరుగా సంపాదించిన థియేటర్ల యజమానులు సినీ రంగానికే దూరమైపోతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్యనగరం తిరుప్పూరులో సినీ థియేటర్లన్నీ అదృశ్యమవుతున్నాయి.


చీకటిలో గోదాములుగా...

తిరుప్పూరు జనాన్ని ఉర్రూతలూగిస్తూ వెండితెర వెలుగులనిచ్చిన ఆ సినీ థియేటర్ల ప్రాంతాలు నేడు చీకిటిలో బనియన్ల గోదాములుగా మారిపోయాయి. ఒకప్పుడు తిరుప్పూరు నగర ప్రధాన చిహ్నంగా వెలుగొందిన యూనివర్శల్‌ థియేటర్‌ గత బ్రహ్మాండమైన ఆనవాళ్లను కూడా ఎవరూ గుర్తించలేనంతగా నేలమట్టమైంది. గజలక్ష్మి థియేటర్‌ కూల్చివేయడంతో అక్కడ జౌళి దుకాణం వెలిసింది. పుష్పా ధియేటర్‌ కూల్చివేసి ఎన్నో యేళ్లుగడిచినా ఆ ప్రాంతంలోని బస్టాపును ‘పుష్పాథియేటర్‌ సెంటర్‌’గానే పిలుస్తున్నారు. జ్యోతి, ధనలక్ష్మి, రాగం అంటూ మరికొన్ని థియేటర్లు కూడా కూల్చివేశారు.. నటరాజ్‌ థియేటర్‌ బనియన్ల గోదాముగా మారి యేళ్లుగడిచాయి. రామ్‌-లక్ష్మణ్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ కూడా బనియన్ల గోడౌన్లగా మారాయి.


ఆ పాత సినీ సంగతులు మధురం...

ఆ కోవలోనే కొత్త బస్టాండు ప్రాంతంలోని శాంతి థియేటర్‌ను కూడా తాజాగా బనియన్ల గోదాముగా వాడుకునేందుకు నెలసరి అద్దెకిచ్చేశారు. ఈ విషయమై శాంతి థియేటర్‌ యజమాని వి.రంగదురై మాట్లాడుతూ 970 సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్‌ నడిపామని, పదేళ్ల క్రితం వరకూ ఏ సినిమా రిలీజ్‌ చేసినా వారం రోజులపాటు రెట్టింపు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవారని, టికెట్లు దొరకకపోతే నిరాశతో తిరిగిపోయేవారని చెప్పారు. తొలినాళ్లలో అయితే ప్రఖ్యాత హీరోల సినిమాలు ప్రదర్శించేటప్పుడు ఫిలిమ్‌ బాక్స్‌ను రథాన్ని ఊరేగించినట్లు నగరమంతా ఊరేగించి థియేటర్‌ వద్దకు చేర్చేవారని, టికెట్ల కోసం క్యూలైన్లలో నిలిచేవారికి హీరోల అభిమాన సంఘాల వారే చల్లటి మజ్జిగ, పండ్ల రసాలను,

nani4.2.jpg


స్వీట్లను పంచిపెట్టేవారని ఆనాటి పాత సంగతులను జప్తికి తెచ్చుకున్నారు. తిరుప్పూరు నగరంలోని ప్రతి థియేటర్‌లోనూ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేసేవారని, రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శిస్తే ఏ సినిమా అయినా సరే వారం రోజుల్లోనే లాభాల పంట పండించేదని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత, ఓటీటీలో సినిమాలు విడుదల చేసే యుగంలోకి ప్రవేశించడంతో ఇకపై సినిమా థియేటర్లను నడపటం ఏ మాత్రం సాధ్యపడదని, ఒక వేళ సాహసించి నడిపినా, గతంలా ప్రేక్షక దేవుళ్ళను రప్పించడం వీలుపడదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో యేళ్లతరబడి సినిమా థియేటర్లను నడిపిన వారంతా వాటిని కల్యాణమండపాలు, షాపింగ్‌ మాల్స్‌గా మార్చుకుని స్థిరమైన సంపాదనపై దృష్టిసారిస్తున్నారని, ఆనాటి సినీ స్వర్ణయుగం మళ్ళీ తిరిగి రానేరాదని, ఆయన నిట్టూరుస్తూ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 11:12 AM