Parliament Budget Session: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:50 PM
Parliament Budget Session: యూఎస్‌లో నివసిస్తున్న అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపేందుకు ట్రంప్ సర్కార్ నడుం బిగించింది. అందులోభాగంగా ఓ విమానంలో 104 మంది భారతీయులను స్వదేశానికి పంపింది. అయితే వారి చేతులకు సంకెళ్లు వేసి.. స్వదేశానికి పంపడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: అమెరికా అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపుతోన్న తరుణంలో.. వారి పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసదారులను స్వదేశానికి పంపడం నేడు కొత్తేమి కాదన్నారు. ఇది ఆ దేశ ప్రామాణిక విధానమని ఆయన తెలిపారు. విమానంలో వారిని తిరిగి తీసుకు వస్తున్న తరుణంలో వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మాత్రం సరికాదని మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. విదేశాలల్లో చట్టవిరుద్దంగా నివసిస్తున్నట్లు తేలితే తమ పౌరులను తిరిగి తీసుకు రావడం అన్ని దేశాల ప్రాథమిక బాధ్యత అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అయితే ఇలా దేశం నుంచి వెనక్కి పంపుతోన్న వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండాలని.. అమెరికా అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతోన్నట్లు ఆయన తెలిపారు. ఇక బహిష్కరణకు గురైన వారు అందించిన సమాచారం ఆధారంగా.. ఏజెంట్లు.. ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. ఇదే సమయంలో.. చట్టబద్దమైన ప్రయాణికులకు వీసాలను సులభతరం చేయడంతోపాటు .. అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం ఉండాలన్నారు. అయితే మహిళలు, చిన్న పిల్లలతో ఈ విధంగా వ్యవహరించడం లేదని తమకు సమాచారం అందిందని తెలిపారు.
మరోవైపు లోక్‌సభలో.. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని తిరిగి స్వదేశానికి పంపడంపై కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గౌరవ్ గోగొయ్‌లతోపాటు కేసీ వేణుగోపాల్ ఇచ్చిన వాయిదా తీర్మానానికి సంబంధించి నోటీసులు అందజేశారు. అమృత్‌సర్‌లో బుధవారం సీ 17 యుద్ధ విమానంలో 104 మంది భారతీయ అక్రమ వలసదారులు యూఎస్ నుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు యూఎస్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వలసదారుల చేతులకు సంకెళ్లు వేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతోన్నాయి.
బహిష్కరణపై ప్రభుత్వం మౌనం.. మండిపడుతోన్న ప్రతిపక్షాలు..
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు విమర్శించారు. అక్రమ వలసదారుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఈ ప్రయాణంలో తమ చేతులకు సంకెళ్లు వేశారని.. అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం తమ చేతులకు ఉన్న సంకెళ్లు విప్పారంటూ అక్రమ వలసదారులు పేర్కొన్నారు. అదీకాక ఈ వ్యవహారంపై కాంగ్రస్ పార్టీ ఎంపీలు మల్లికార్జున్ ఖర్డే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు అమెరికా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా.. పార్లమెంట్‌లో ప్రదర్శన నిర్వహించారు. అలాగే మరికొంత మంది నాయకులు అయితే చేతులకు సంకెళ్లు ధరించారు.
For National News And Telugu News