Kumbh Mela: ఆటవిక రాజ్యం తెచ్చినోళ్లు మన నమ్మకాలను గౌరవిస్తారా?
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:20 AM
బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, లాలూపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ఐక్యతను కుంభమేళా వేడుక నిదర్శనం అని.. ఐరోపా జనాభాకు మించి ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు పుణ్యసాన్నాలు చేశారని, బిహార్ నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వచ్చారన్నారు.

కుంభమేళాపై లాలూవి అసభ్యకరమైన వ్యాఖ్యలు
పశువుల దాణా మెక్కినోళ్లు రైతుల గురించి ఆలోచిస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ
‘పీఎం కిసాన్’ నిధుల విడుదల
కుంభమేళాను విమర్శించే వారు రాబందులు, పందులు
యూపీ సీఎం యోగి వ్యాఖ్య
భాగల్పూర్, భోపాల్, ఫిబ్రవరి 24: మహా కుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ ‘అసభ్యకరమైన’ వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బిహార్‌లో ‘ఆటవిక రాజ్యాన్ని’ తెచ్చినోళ్లు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ, లాలూపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ఐక్యతను కుంభమేళా వేడుక నిదర్శనం అని.. ఐరోపా జనాభాకు మించి ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు పుణ్యసాన్నాలు చేశారని, బిహార్ నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వచ్చారన్నారు. అయితే ‘ఆటవిక రాజ్యం వాళ్లు’ మన సంస్కృతి, వారసత్వాలు.. నమ్మకాలను ద్వేషిస్తారని లాలూ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించారని, దీన్ని బిహార్ ప్రజలూ మరిచిపోలేరని పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ డిమాండ్ చేస్తూ.. ‘‘కుంభమేళాతో ఏం ప్రయోజనం? అదో మూర్ఖపు తంతు’ అని విమర్శించారు. రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఆర్జేడీకి లేదని.. పశువుల దాణాను భోంచేసిన వారికి రైతుల ప్రయోజనం గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది? అని మోదీ ప్రశ్నించారు.
అప్పట్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి బిహార్‌లో అధికారాన్ని వెలగబెట్టడం ద్వారా ఆ రాష్ట్రాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమం సందర్భంగా పీఎం-కిసాన్ కింద రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందని.. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 9.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయం కోసం రూ.22వేల కోట్లు వేశామని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని 40 నిమిషాలు మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించే ముందు ఆయన్ను తామరగింజలతో తయారు చేసిన దండతో సన్మానించారు. తామరగింజలు మంచి ఆహారం అని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో తాను తామరగింజలను దాదాపు రోజూ ఆహారంలో తీసుకుంటానని మోదీ చెప్పారు. బిహార్‌లో తామరగింజల ఉత్పత్తి బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించామని, తామరగింజలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉందన్నారు.
క్షమించండి.. అందుకే ఆలస్యంగా వచ్చా
ప్రఽధాని మోదీ సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులోనూ పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని.. ఆర్థికరంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచ బ్యాంకు చెప్పిందని ప్రధాని అన్నారు. కాగా ఐరాసలో వాతావరణ మార్పులపై పనిచేసే సంస్థ.. భారత్‌ను సౌరశక్తిలో సూపర్‌పవర్‌గా పేర్కొందని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి 15- 20నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు సదస్సులోని ప్రతినిధులను మోదీ క్షమాపణలు కోరారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ పరీక్షలు ప్రారంభమయ్యే సమయం, తాను సదస్సుకు రాజ్‌భవన్ నుంచి బయలుదేరే సమయం ఒకటేకావడంతో తాను ఆలోచించానన్నా రు. తాను నిర్ణీత సమయానికే బయలుదేరితే.. భద్ర త దృష్ట్యా ఏర్పాటుచేసే గ్రీన్ కారిడార్‌తో విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశం ఉండేదన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లాక తాను బయలుదేరానన్నారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.