Kumbha Mela 2025: కుంభమేళా అంటే ఏంటి.. 12 ఏళ్లకోసారే ఎందుకంటే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 02:21 PM
Kumbha Mela 2025: మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిగ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో అతిపెద్ద భక్తజన సమ్మేళనంగా చెప్పుకునే మహా కుంభమేళాకు సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఉత్సవం మొదలుకానుంది. దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది తరలిరానున్న ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. త్రివేణి సంగమాన్ని దర్శించుకుని స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భారత్ నుంచే కాదు.. ఈసారి 123 దేశాల నుంచి ఏకంగా 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరవుతారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఆఖరుగా 2013లో జరిగిన ఈ ఉత్సవానికి 20 కోట్ల మంది వచ్చారని ఆ సర్కారు అంచనా వేసింది. ఇంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కుంభమేళా వెనుక ఉన్న చరిత్ర ఏంటి? అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్? అనేది ఇప్పుడు చూద్దాం..
పవిత్ర స్నానాల కోసం..
కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఆఖరుగా 2013లో కుంభమేళా, 2019లో అర్ధ కుంభమేళా జరిగాయి. ఇది 6 ఏళ్లకు ఓసారి జరిగే మేళాగా చెప్పొచ్చు. ఈసారి జనవరి 13వ తేదీన పుష్య మాస పౌర్ణమి రోజు నాడు కుంభమేళా స్టార్ట్ కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. ఈ నలభై ఐదు రోజుల్లో 6 రోజులను భక్తులు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తారు. భక్తులతో పాటు నాగ సాధువులు, కల్పవాసీలు (నెల రోజుల దీక్ష చేసేవారు), పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా కుంభమేళాకు అటెండ్ అవుతారు.
ఆ 4 నదుల్లోనే ఎందుకు?
నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో మేళా జరుపుతారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం చూడొచ్చు. అదే హరిద్వార్‌లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉజ్జయినిలో శిప్రా, నాసిక్‌లో గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. బోలెడు నదులున్నా ఈ నదుల్లోనే, అదీ ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ, అధర్వణ వేదాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేయగా.. అందులో నుంచి అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని తొలుత జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరిగొస్తుంది. ఆ సమయంలో కలశంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని.. అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్తు ఉందని అంటుంటారు.
12 ఏళ్లకు ఒకసారే ఎందుకంటే..?
కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారే నిర్వహించడం వెనుక కూడా ఓ ఆచారం ఉందని చెబుతుంటారు. రోజుకు 24 గంటలు. అదే దేవతలకైతే రోజు అంటే సంవత్సర కాలానికి సమానం. జయంతుడు అనే కాకి భూమి చుట్టూ 12 రోజులు తిరిగిందని పురాణాల్లో ఉంది. ఆ లెక్కన 12 సంవత్సరాలకు ఒకసారి మేళా జరపాలనేది ఆచారంగా వస్తోందని అంటుంటారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో ఈ ఉత్సవం జరిగినా.. సరస్వతి నది అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
కుంభమేళాకు వెళ్లే తెలుగు ప్రజల కోసం పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-వారణాసికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 26, ఫిబ్రవరి 2వ తేదీల్లో విశాఖ నర్సాపూర్ నుంచి వారణాసికి స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖ నుంచి గోరఖ్‌పూర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల నడుమ ట్రైన్స్ నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల తిరుగు ప్రయాణాలు, టైమింగ్స్ తదితర వివరాల కోసం ఇక్కడ (https://www.irctc.co.in/nget/train-search) క్లిక్ చేయండి..
Also Read:
రైతు భరోసాపై కీలక అప్‌డేట్..
హిందీ సినిమాలపై అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు
పుష్ప నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
For More Special And Telugu News