Thieves stole Shivalingam: శివాలయానికి వెళ్లిన భక్తులకు షాక్.. తలుపులు తీసి చూసే సరికే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:06 PM
గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాతన ఆలయం కావడం, సముద్రం ఒడ్డున ఉండడంతో అక్కడికి భక్తులు రోజూ పెద్దఎత్తున వస్తుంటారు.

గుజరాత్: పెద్దలు చెప్పే సామేతలు అప్పుడప్పుడు మనకు ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తుంటాయి. అలాంటిదే "గుడితోపాటు గుడిలోని లింగాన్నీ మింగేసే రకం" అనేది. దీన్ని కొంతమంది మోసగాళ్లను ఉద్దేశిస్తూ చెప్పే సామెత. అదేదో సామెత.. అసలు శివలింగాన్ని ఎవరు మాయం చేస్తారులే అని సాధారణంగా అనుకుంటుంటాం. కానీ నిజానికి ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. అది కూడా శివరాత్రికి ముందురోజు, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాతన ఆలయం కావడం, సముద్రం ఒడ్డున ఉండడంతో అక్కడికి భక్తులు రోజూ పెద్దఎత్తున వస్తుంటారు. మహాదేవుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం సముద్ర తీరాన సేద తీరుతుంటారు. అయితే శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు నిన్న(మంగళవారం) పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని అలంకరించారు. అనంతరం గుడికి తాళాలు వేసి వెళ్లిపోయారు. శివరాత్రి సందర్భంగా పూజలు చేసేందుకు ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున పూజారి సహా భక్తులు పెద్దఎత్తున ఆలయం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు వారంతా అవాక్కయ్యారు.
ఆలయానికి వెళ్లిన పూజారి తలుపులు తీసి గర్భగుడిలోకి వెళ్లారు. అక్కడ శివలింగం లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. పూజారితోపాటు భక్తులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, అర్ధరాత్రి వేళ ఆలయం లోపలికి ప్రవేశించిన దుండగులు.. శివలింగాన్ని దొంగిలించారు. శివలింగాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. అప్రమత్తమైన పూజారి సమాచారాన్ని వెంటనే దేవదాయశాఖ అధికారులు, పోలీసులకు అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆలయ అధికారులు.. స్కూబా డ్రైవర్ల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగిలించిన శివుడి ప్రతిమను నీటిలో పడేశారా? లేక పడవగుండా ఎక్కడికైనా తరలించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, భారతదేశానికి చెందిన అనేక పురాతన, విలువైన విగ్రహాలు తరచూ చోరీలకు గురవుతున్నాయి. వాటిని దొంగిలిస్తున్న కేటుగాళ్లు విదేశాలకు లక్షలు, కోట్లకు అమ్మేస్తున్నారు. ఏళ్ల తర్వాత ఈ విగ్రహాలు ఇతర దేశాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని గుర్తించి తిరిగి తీసుకువచ్చేందుకు అధికారులు నానా తిప్పలూ పడుతున్నారు. అయితే విగ్రహాలు చోరీలకు గురవకుండా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వాలు, పురావస్తు శాఖ అధికారులు విఫలం అవుతున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..
Trump Gold Cards: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. అమెరికా శాశ్వత పౌరసత్వంపై కీలక ప్రకటన..