Share News

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ఇది అన్‌బ్రేకబుల్ రికార్డ్

ABN , Publish Date - Feb 03 , 2025 | 08:45 AM

IND vs ENG: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ లాంటి తోపు ప్లేయర్‌కు అందని క్రేజీ రికార్డును ఒక్క ఇన్నింగ్స్‌తో అందుకున్నాడు.

Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ఇది అన్‌బ్రేకబుల్ రికార్డ్
Abhishek Sharma

కసితో కొట్టాడు. ఒక్కొక్కర్ని లెక్కబెట్టి మరీ బాదాడు. బౌలర్ చేతుల్లో నుంచి బాల్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం బౌండరీకి పంపించాడు. ఆకలిగొన్న సింహంలా ప్రత్యర్థుల మీద పడి ఊచకోత కోశాడు. ఫోర్ల మీద ఫోర్లు, సిక్సుల మీద సిక్సులు కొట్టినా అతడి పరుగుల దాహం తీరలేదు. దీంతో జూలువిదిల్చి మరింత భీకరంగా ఆడాడు. అతడి భారీ షాట్ల ధాటికి వాంఖడే స్టేడియం చిన్నబోయింది. అతడి పరుగుల సునామీలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తడిసి ముద్దయ్యారు. ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌కు భారత అభిమానులు సాక్ష్యంగా నిలిచారు. ఇంత భీకరంగా ఆడింది మరెవరో కాదు.. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బట్లర్ సేనతో ముంబై వేదికగా జరిగిన 5వ టీ20లో యువీ శిష్యుడు బీభత్సం సృష్టించాడు.


లెక్కబెట్టి కొట్టాడు!

ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో అభిషేక్ దుమ్మురేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడనే మాట కూడా అతడి బ్యాటింగ్ ముందు తక్కువేనని చెప్పాలి. అంత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 135 పరుగులతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లాంటి తోపు బౌలర్లను బ్యాట్ మడతబెట్టి కొట్టాడు. బౌలింగ్ చేయాలంటే భయపడేలా చేశాడు. అతడి బ్యాటింగ్ దెబ్బకు భారత్ 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరు చేసింది. చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించాడు అభిషేక్. కోహ్లీకి సాధ్యం కాని అరుదైన రికార్డును అతడు అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు.


బ్రేక్ చేయడం కష్టమే!

ఇంగ్లండ్‌తో నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ 37 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ బాదిన భారత బ్యాటర్ల జాబితాలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (35 బంతుల్లో) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో అభిషేక్ నిలిచాడు. సంజూ శాంసన్ (40 బంతుల్లో), తిలక్ వర్మ (41 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 13 సిక్సులు బాదిన అభిషేక్.. భారత్ తరఫున టీ20ల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. శ్రీలంక మీద 2017లో 10 సిక్సులు కొట్టాడు హిట్‌మ్యాన్. అభిషేక్ సిక్సుల రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టంగా కనిపిస్తోంది. దాన్ని బద్దలుకొట్టాలన్నా అతడి వల్లే సాధ్యంగా అనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.


ఇవీ చదవండి:

మనమ్మాయిల మరో ప్రపంచం

టైటిల్‌ వెనుక.. చిచ్చర పిడుగులు

సర్వీసెస్‌ ప్రపంచ రికార్డు ఛేదన

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 09:49 AM