Pat Cummins: మాట నిలబెట్టుకున్న కమిన్స్.. చెప్పిందే చేశాడు
ABN , Publish Date - Jan 05 , 2025 | 05:04 PM
IND vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పిందే చేశాడు. ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదట్లో ఇచ్చిన మాట మీద అతడు నిలబడ్డాడు. దీంతో కమిన్స్ మామూలోడు కాదని.. తోపు అని మెచ్చుకుంటున్నారు కంగారూ ఫ్యాన్స్.
కెప్టెన్స్‌గా ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరిస్తారు. కొందరు వినయం, నమ్రతతో ఉంటే.. మరికొందరు కాస్త పొగరుగా, గర్వంతో ఉన్నట్లు కనిపిస్తారు. ఆస్ట్రేలియా జట్టు సారథులు రెండో కేటగిరీలోకి వస్తారు. క్రికెట్‌లో తమను మించిన వారు లేరు, తామే తోపులు అనేలా బిహేవ్ చేస్తుంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ఇదే యాటిట్యూడ్‌తో మాట్లాడుతుంటారు. ఆ జట్టు ప్రస్తుత సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఎదురుగా ఉన్నది ఏ జట్టు అయినా, ఆడేది ఏ టోర్నమెంట్‌లోనైనా కమిన్స్ మాటలతోనే రెచ్చగొడతాడు. అలాగని అతడు మాటల మనిషే కాదు.. చేతల్లోనూ తాను తోపేనని ప్రూవ్ చేస్తుంటాడు. ఇచ్చిన మాట మీద నిలబడి మరోమారు గ్రేట్ అనిపించుకున్నాడు కమిన్స్. అతడి మాట ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఒక వారం మాది కాదు!
10 ఏళ్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ దగ్గరే ఉంది. ఆసీస్‌కు గత రెండు పర్యాయాల్లో వచ్చి విజయబావుటా ఎగురవేసింది టీమిండియా. అసలే డామినేషన్ అలవాటైన కంగారూలు.. సొంతగడ్డ మీద భారత్ తమను చావుదెబ్బ కొట్టడాన్ని తట్టలేకపోయారు. గతంలో కెప్టెన్స్‌గా ఉన్నవారు మెన్ ఇన్ బ్లూ జోరును ఆపలేకపోయారు. దీంతో టీమిండియాను ఓడించి తిరిగి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ప్రస్తుత సారథి కమిన్స్ భావించాడు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లోనే ఆ టీమ్ దారుణంగా ఓడిపోయింది. దీంతో కంగారూల పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక వారం రోజులు సరిగ్గా ఆడనంత మాత్రాన తమ పనైపోయినట్లు కాదని.. తాము ఏంటో చూపిస్తామని, ట్రోఫీని గెలుచుకుంటామని ఫ్యాన్స్‌కు వాగ్దానం చేశాడు. తమది నంబర్ వన్ టీమ్ అన్నాడు.
నెలలో అంతా తారుమారు!
కమిన్స్ మాట వమ్మ కాలేదు. నెల రోజులు తిరిగే సరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది ఆసీస్. ఒకదశలో 0-1తో వెనుకబడిన జట్టు లేచి నిలబడి.. దూకుడైన ఆటతీరుతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ట్రోఫీ గెలుస్తామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు కమిన్స్. దీంతో అతడ్ని ఆసీస్ అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. క్రంచ్ సిచ్యువేషన్‌లోనూ తట్టుకొని నిలబడటం, టీమ్ కోసం ఫైట్ చేయడం, భారాన్ని భుజాల మీద మోయడం హైలైట్ అని అంటున్నారు. కాగా, అప్పట్లో వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ టైమ్‌లోనూ స్టేడియంలోని లక్ష మందిని సైలెంట్ చేస్తానని కామెంట్ చేసి చూపించాడు. ఇప్పుడు కూడా తిరిగి భారత్‌ను ఓడిస్తామని చెప్పి చూపించాడు. దీంతో గెలవాలనే తపన, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న కమిన్స్‌లో ఈ మాత్రం గర్వం, పొగరు ఉండటంలో తప్పు లేదని నెటిజన్స్ అంటున్నారు.