Birthday Celebrations: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:09 AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

బీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు
కేసీఆర్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
మర్కుక్/సిద్దిపేట టౌన్/హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కార్లతో నిండిపోయాయి. బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నాయకులు వచ్చి కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాములపర్తిలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి కేసీఆర్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు కూడా దండలు మార్చుకున్నారు. మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు గులాబీల వర్షం కురిపించారు. మరోవైపు కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించినట్లే ఆయుష్షు హోమం, సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన జట్లకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ గెలుస్తుందని, వరుసగా మూడుసార్లు కేసీఆర్, ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు.
‘వందేళ్ల ముందుచూపు’ పుస్తకం ఆవిష్కరణ..
‘వందేళ్ల ముందుచూపు’ పేరిట కేసీఆర్ పదేళ్లపాలన, అభివృద్ధి అంశాలపై రచయిత జూలూరు గౌరీశంకర్ వెలువరించిన పుస్తకాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఆవిష్కరించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, రవీందర్‌రావు, వి.ప్రకాష్ తదితరులు పా ల్గొన్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని హస్తినాపురం డివిజన్ నందనవనంలోని మూసానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించడంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నినాదాలు చేయించారని అభ్యంతరం తెలిపారు.