Nagarjuna Sagar: సాగర్ డ్యాం స్పిల్‌వేను పరిశీలించిన సీడబ్య్లూసీ, కేఆర్‌ఎంబీ సభ్యులు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:17 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేను శనివారం కేంద్ర జల సంఘం(సీడబ్య్లూసీ), కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సభ్యులు పరిశీలించారు.

స్టాప్ లాక్ గేట్ల ఏర్పాటుకు కేంద్రానికి నివేదిస్తామని వెల్లడి
నాగార్జునసాగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేను శనివారం కేంద్ర జల సంఘం(సీడబ్య్లూసీ), కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సభ్యులు పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘సాగర్ స్పిల్‌వేపై మళ్లీ గుంతలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన సీడబ్య్లూసీ, కేఆర్‌ఎంబీ సభ్యులు శనివారం సాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు నడక మార్గం పై నుంచి దెబ్బతిన్న స్పిల్‌వేని పరిశీలించి ఫొటోలు తీసుకున్నారు. ఈ విషయంపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదికలు అందజేస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు తెలిపారు. అనంత రం ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని, గ్యాలరీలను, క్రస్ట్ గేట్లను పరిశీలించారు. ప్రధాన జల విద్యుత్ కేం ద్రంలో మరమ్మతులు చేస్తున్న రెండో నంబరు టర్బైన్‌నూ పరిశీలించారు. అనంతరం విజయవిహార్ అతిథి గృహంలో సీడబ్య్లూసీ సీనియర్ జాయింట్ కమిషనర్ విలేకరులతో మా ట్లాడారు.
సాగర్ ప్రాజెక్టును పరిశీలించి పటిష్టతకు చేపట్టాల్సిన పనుల గురించి, అలాగే ఏపీ, తెలంగాణ మధ్య నె లకొన్న నీటి వివాదాల గురించీ తెలుసుకున్నట్లు చెప్పారు. సాగర్ ప్రాజెక్టు బలోపేతానికి గతంలో రూ.160 కోట్లు కావాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరు, స్పిల్‌వే మరమ్మతులు, డ్యాంకు స్టాప్ లాక్ గేట్లు అమర్చడంపై నివేదికలు తయారుచేసి కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. కాగా, సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం పటిష్ఠంగానే ఉందని సాగర్ జలవిద్యుత్ కేంద్రం సీఈ మంగే్‌షకుమార్ తెలిపారు. ఇటీవల శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జీరో ఫ్లోర్‌లోని ఒకటో యూనిట్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి నీరు లీకవుతున్న నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. టర్బైన్లు నిరంతరాయంగా తిరగడం వల్లే శ్రీశైలంలో జీరో ఫ్లోర్‌లో నీటి లీకేజీలు కనిపించాయని, కానీ సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఉన్న ఎనిమిది టర్బైన్లలో ఆ సమస్య లేదని పేర్కొన్నారు.