High Court: ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావుకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:18 AM
ప్రధాన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. శ్రవణ్‌కుమార్ రావుకు శనివారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. శ్రవణ్‌కుమార్ రావుకు శనివారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కె.సుజన ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ కేసులో మిగతా నిందితులంతా ప్రభుత్వ ఉద్యోగులని, వారిపై పెట్టిన సెక్షన్లు జర్నలిస్టు అయిన శ్రవణ్‌రావుకు వర్తించవని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. శ్రవణ్‌రావు ఇతర నిందితులతో కలిసి కుట్రలో భాగస్వామిగా ఉన్నారని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ చాలాకాలంగా చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలిపింది. దర్యాప్తు పూర్తికాలేదని, దీనికి నిర్బంధ విచారణ అవసరమని వ్యాఖ్యానించింది. ఆయన ప్రవర్తన, కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే ముందస్తు బెయిల్ అర్హుడు కాదని స్పష్టం చేసింది.