HYDRA: హైడ్రాకు ఫిర్యాదులు.. మాజీ ఎమ్మెల్యే ఫెన్సింగ్ నేలమట్టం.. ఎక్కడంటే
ABN , Publish Date - Jan 28 , 2025 | 11:18 AM
HYDRA: ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. అమీర్‌పూర్‌లో అక్రమాలపై మరోసారి పంజా విసిరింది హైడ్రా. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.

సంగారెడ్డి జిల్లా , జనవరి 28: హైడ్రా (HYDRA) మరోసారి పంజా విసిరింది. అమీన్ పూర్‌లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ... వాటిని కూల్చివేసే పనిలో పడుతోంది. ఆక్రమణదారుల వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది హైడ్రా. తాజాగా అమీన్ పూర్‌లో మరోసారి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అమీన్ పూర్ పద్మావతి లేఅవుట్‌లో అక్రమంగా వేసిన ఫెన్సింగ్‌ను మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు తొలగించేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహారీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్‌ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్ రాజగోపాల్ నగర్, బందంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. అమీన్ పూర్ చెరువు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణ జరిగినట్లు తేలడంతో కూల్చివేతకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో వెంటనే హైడ్రా బుల్డోజర్లు అక్కడకు చేరకుని కూల్చివేతలు జరిపాయి.
సంచలనం సృష్టిస్తున్న పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య..
కొన్నేళ్లుగా పోరాటం...
అమీన్ పూర్ పెద్ద చెరువుకు అనుకుని ఉన్న పద్మావతి నగర్ లేఅవుట్ ఆక్రమణకు గురైంది. 193, 194, 323 సర్వే నెంబర్లో 24 ఎకరాల్లో పద్మావతి లే అవుట్ విస్తరించి ఉంది. రాజకీయ పలుకుబడితో లే అవుట్‌ను కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు కబ్జా దారులు. ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారుగా 2006 నుంచి ఈ అంశంపై బాధితులు పోరాడుతున్నారు. ఏళ్లుగా స్థానికంగా ఎవరు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. మొత్తం 294 ప్లాట్స్‌తో పద్మావతి నగర్ లే అవుట్ ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల క్రితం మొదటగా హైడ్రాను బాధితులు ఆశ్రయించారు. సర్వే చేసి మూడు నెలల క్రితం చుట్టూ నిర్మించిన గోడను హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా కూల్చివేతల తరువాత కొద్ది రోజులకే ఐరన్ ఫెన్సింగ్‌కు కబ్జా దారులు వేశారు. దీనిపై మరోసారి హైడ్రా ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది.
గతంలో కూడా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. అమీన్‌పుర్‌లో అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా.. వాటిని కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వేనెంబర్ 848లో రోడ్డున ఆక్రమించి నిర్మించిన ఇళ్లును హైడ్రా కూల్చివేసింది. ఇళ్లు నిర్మాణంపై ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన హైడ్రా... అక్కడకు చేరుకుని ఇంటిని ప్రొక్లైనర్ల సహాయంతో నేటమట్టం చేసింది. భారీ బందోబస్తు నడుమ హైడ్రా కూల్చివేతలు చేసింది. హైడ్రా కూల్చివేతలపై వందనపురి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలంగా అక్రమ ఇళ్ల నిర్మాణంపై పోరాటం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధకారులు ఎవరూ పట్టించుకోలేదని.. చివరకు హైడ్రాకు ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిల్లోనే అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
రోడ్డు దాటుతున్న వ్యక్తిని.. చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు ..
నన్ను కావాలనే హనీట్రాప్ కేసులో ఇరికించారు: ప్రొ. దుర్గప్ప
Read Latest Telangana News And Telugu News