SC Categorization.. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం
ABN , Publish Date - Feb 03 , 2025 | 08:28 AM
ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేయనుంది. ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టీ ప్రభుత్వం ఆమోదించనుంది.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ (SC Categorization)పై సోమవారం కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee).. ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేతృత్వంలో భేటీ జరగనుంది. ఈ సందర్బంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ సబ్ కమిటీకి నివేదికను ఇవ్వనుంది. ఆగస్టు1, 2024న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సూచన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియామకమైంది. దీంతో జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేయనుంది. ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టీ ప్రభుత్వం ఆమోదించనుంది.
ఈ వార్త కూడా చదవండి..
కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మంగళవారం శాసనసభ, మండలి ప్రత్యేక భేటీ జరగనుంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళికా విభాగం.. సంబంధిత నివేదికను ఆదివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా ఉత్తమ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘానికి సోమవారం నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు.
అనంతరం ఈ అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమవనున్న సమావేశం.. ఈ అంశాలపై చర్చ ముగిసే వరకూ కొనసాగనుంది. బీసీ కేటగిరీ ముస్లింలతో కలుపుకొని రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతం మేరకు ఉన్నట్లు సమగ్ర కులగణన సర్వే తేల్చింది. ఈ వివరాల ఆధారంగానే బూసాని వెంకటేశ్వరరావు కమిషన్.. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా 27.88 శాతం మేరకు ఉంది. అంటే వారికి స్థానిక సంస్థల్లో 27 నుంచి 28 శాతం వరకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు దక్కే రిజర్వేషన్ 22-23 శాతం మాత్రమే. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయడంతో పాటు 9వ షెడ్యూల్‌లో పేర్కొనాల్సిందే. ఈ మేరకు సమగ్ర వివరణతో కూడిన నివేదికను బూసాని కమిషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. అలాగే ఎస్సీ వర్గీకరణపైనా అసెంబ్లీలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News