Hydra: ‘బరి తెగింపు’ భవనం కూల్చివేత
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:27 AM
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.
అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా
నేలమట్టం చేసే పని ప్రారంభించిన యంత్రాంగం
7 అంతస్తుల భవనం.. జీహెచ్‌ఎంసీ నిబంధనలు బేఖాతరు
స్థానికుల ఫిర్యాదుతో అక్రమమని నిర్ధారించి హైడ్రా చర్యలు
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది. ఎటువంటి అనుమతుల్లేకుండా ఏడు అంతస్తులుగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేస్తోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఈ భవనాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణంగా తేల్చగా.. ఆదివారం హైడ్రా యంత్రాంగం దీనిని కూల్చివేసే పని మొదలుపెట్టింది. ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవన నిర్మాణంపై ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ‘బరి తెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా, వంద అడుగుల రోడ్డును ఆక్రమించి 684 గజాల స్థలంలో రెండు సెల్లార్‌లతో కలిపి ఏడు అంతస్తులుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐదు అంతస్తులను వంద ఓయో రూమ్‌లుగా నిర్మాణం చేపట్టారు. అయితే జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసులను, హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా చేపట్టిన ఈ భవనం నిర్మాణంపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఎలాంటి సెట్‌బ్యాక్‌లు వదలకుండా, తగిన పార్కింగ్ సౌకర్యం, ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకోకుండా సెల్లార్‌లోనే కిచెన్ ఉండేలా నిర్మాణం జరుపుతున్నట్లు హైడ్రా అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. ఈ మేరకు భవనం కూల్చివేత చేపట్టారు. ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మద్య హైడ్రా అధికార యంత్రాలను రప్పించి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మధ్యాహ్నం సమయంలో బాహుబలి క్రేన్‌ను తెప్పించి.. భవనం వెనక వైపు నుంచి గోడలను కూల్చివేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మెయిన్ రోడ్డు పక్కనే భవనం ఉండడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.
నేడు కూడా కొనసాగనున్న కూల్చివేతలు..
ఆదివారం హైడ్రా కూల్చివేతలు భవనం వెనక భాగంలోనే జరిగాయి. వెనక నుంచి భారీ క్రేన్‌లతో మొదట కట్టిన గోడలను కూల్చివేశారు. బాహుబలి క్రేన్ ఆలస్యంగా రావడంతో కూల్చివేతలు వేగంగా చేపట్టలేకపోయారు. భవనం వంద అడుగుల రోడ్డును ఆక్రమించి ఉండడం, దాని పక్కన అండర్ పాస్ రోడ్డు ఉండడంతో ఒక వైపు నుంచే రెండు క్రేన్‌లతో కూల్చివేత పనులు చేపట్టాల్సి వచ్చింది. భవనాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయాలంటే సోమవారం సైతం ఎత్తయిన క్రేన్‌లను వినియోగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ భవన నిర్మాణం అక్రమమని, దీనిని కూల్చివేస్తున్నామని తెలుపుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు 2024 ఫిబ్రవరి 14నే నోటీసులు జారీ చేసింది. అనంతరం ఫిబ్రవరి 26న స్పీకింగ్ ఆర్డర్ సైతం ఇచ్చింది. మరోవైపు హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నంబరు 10030/2024పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించింది. దీని కూల్చివేతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అదే ఏడాది ఏప్రిల్ 19న ఆదేశించింది. ఈ ఆదేశాలతో జూన్ 13న భవనం కొంత భాగాన్ని కూల్చివేశారు. అయినా నిర్మాణదారు ఇవేవీ పట్టించుకోకుండా భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే భవనం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. అయితే కూల్చివేత సమయంలో.. భవన నిర్మాణంలో పనిచేస్తున్న కొందరు కార్మికులు.. తమ సామాన్లు లోపలే ఉండిపోయాయని, వాటిని తీసుకుంటామని చెప్పినా హైడ్రా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. దీనికితోడు తాము పనిచేస్తున్నందుకు ఈ నెలకు సంబంధించిన జీతం ఇప్పటివరకు యజమాని ఇవ్వలేదని చెప్పారు.
జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డును ఆనుకొని నిర్మించిన అక్రమ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. దీంతో స్లాబ్‌పై కొన్ని రంధ్రాలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జిహెచ్‌ఎంసీ చేసిన రంధ్రాలను మూసివేసి మరో రెండు అంతస్తుల అదనపు నిర్మాణం చేపట్టారు. దీనిపై హైకోర్టులో ధిక్కార ఫిటిషన్ సైతం దాఖలై విచారణ కొనసాగుతోంది. అయ్యప్ప సొసైటీలో దాదా పు చాలా నిర్మాణాలు చట్టవిరుద్ధంగానే ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలను కూల్చివేయాలంటే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉం టుంది. దానికి అనుగుణంగానే హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుంటాం. కూల్చివేసిన భవన అక్రమ నిర్మాణానికి బాఽధ్యులైన అధికారులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తాం.