Share News

వైభవంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:14 AM

స్వస్తిశ్రీ విశ్వవాసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పారాయణాలు నిర్వహించారు.

వైభవంగా ఉగాది వేడుకలు

ఓదెల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : స్వస్తిశ్రీ విశ్వవాసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పారాయణాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలకు పూజలు నిర్వహించారు. గతంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ప్రదక్షిణలు కనబడలేదు. వాటి స్థానంలో వాహనాలకే రథాలను తయారుచేసి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. హరిపురం గ్రామానికి చెందిన యాదవ భక్తులు మేకల బండ్లతో ప్రత్యేక ప్రదక్షిణలు నిర్వహించారు. జమ్మికుంట, సుల్తానాబాద్‌, మంచిర్యాల, మందమర్రితో పాటు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి మొక్కులను సమర్పించారు. అలాగే పొత్కపల్లి లో రాజగోపాలస్వామి, భవాని సహిత మహా లింగేశ్వర స్వామి, మడకలో ఉమామహేశ్వర స్వామి, కనగర్తిలో శివాలయం, ఆంజనేయస్వామి, కొలనూర్‌ లో మల్లన్న గుట్ట వద్ద ఉగాది వేడుకలు, వాహనాల పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మల్లన్న జాతరతో పాటు ఓదెల సీతారామచంద్రస్వామి, శివాలయం అలాగే గుంపుల రామభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఇళ్ళ ముంగిట మహిళలు రంగవల్లులతో వాకిళ్లను అలంకరించి, పచ్చని తోరణాలతో ఉగాది వైభవాన్ని చాటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ ఏఎస్‌ఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో పొత్కపల్లి పోలీస్‌ సిబ్బంది బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఉగాది వేడుకలకు దాదాపు 15 వేల మంది భక్తులు హాజరయ్యారు.

ఆదివరహస్వామి సన్నిధిలో ఉగాది ఉత్సవాలు

కమాన్‌పూర్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని ఆదివరహస్వామి సన్నిధిలో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి పూజలు చేశారు. వాహనదారులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఆచార్యులు కలకుంట్ల వరప్రసాద్‌ పంచాంగ శ్రవణం చేశారు. కమాన్‌పూర్‌ పిరమిడ్‌ స్వచ్ఛంద సంస్థవారు భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన జరుగకుండా టూటౌన్‌ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు కె.ప్రసాదరావు, రవళి, ఏఎస్‌ఐ బాలజీ, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఆర్‌జీ 2 జీఎం సుధాకర్‌రావు, యూట్యూబర్‌ వర్షిని, ముత్యాల దామోదర్‌, ఇనుగంటి రామారావు, కిషన్‌రెడ్డి తదితరులు ఉగాది ఉత్సవాలలో పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:14 AM