Komatireddy Venkata Reddy: పదేళ్లు ఇక్కడే.. ఎక్కడికీ పోం
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:39 AM
మేం అటు ఇటు ఎక్కడికీ పోం. పదేళ్లు ఇక్కడే (అధికారంలో) ఉంటాం. మీ (బీఆర్‌ఎ్‌స)లాగా ఎక్కువ మాట్లాడం.. పని ఎక్కువ చేస్తాం’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు.

శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రోడ్లే వేయలేదు
యాగాలు చూడడమే ప్రశాంత్‌రెడ్డి పని
రోడ్లు, బ్రిడ్జిలు కట్టడం నాపని: కోమటిరెడ్డి
క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా: ప్రశాంత్
సభ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
కోమటిరెడ్డి తప్పుడు సమాధానం ఇచ్చారంటూ స్పీకర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘మేం అటు ఇటు ఎక్కడికీ పోం. పదేళ్లు ఇక్కడే (అధికారంలో) ఉంటాం. మీ (బీఆర్‌ఎ్‌స)లాగా ఎక్కువ మాట్లాడం.. పని ఎక్కువ చేస్తాం’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చే క్రమంలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. కోమటిరెడ్డి మాట్లాడిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ బయట కూడా వీరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం’ అనే అంశంపై వచ్చిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి సమాధానమిస్తూ.. తాము పీపీపీ విధానంలో కాకుండా హైబ్రిడ్ యాన్యునిటీ మోడల్ (హ్యామ్)లో రోడ్లు వేస్త్తామన్నారు. ఈ విధానంలో 2016లో జాతీయ హైవేను ప్రారంభించి, ఇప్పటికే 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అయితే రోడ్ల పనులపై మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని, అటు ఇటు పోవద్దని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దీంతో తాము ఎక్కడికీ పోమని, పదేళ్లు ఇక్కడే ఉంటామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆరేళ్ల క్రితం తాను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో... ఈ రోజు కూడా అలాగే ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క మంచి పని అయినా చేశారేమో చెప్పాలన్నారు.
రోడ్ల మీద ఏమీ రాదని వదిలేశారు..!
‘‘మీ ప్రాధాన్యం కాళేశ్వరం, లిఫ్టులు మాత్రమే. రోడ్ల మీద ఏమీ రాదని.. వాటిని ప్రాధాన్యంలేని జాబితాలో పెట్టారు. ప్రశాంత్‌రెడ్డికేమో సచివాలయం కట్టాలి.. ప్రగతిభవన్, ఫామ్‌హౌ్‌సలలో యాగాలు చూసుకోవాలి.. అదే పని. కానీ, నాకు యాగాలు, యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలె.. బ్రిడ్జి కట్టాలె.. ఇవే నా పనులు’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పదేళ్లు రోడ్లు వేశామా? లేదా? గుంతలు పూడ్చలేదని నా క్యారెక్టర్‌ను అసాసినేట్ చేస్తే ఎలా? సీఆర్‌ఎఫ్ నిధులు తెచ్చామా? లేదా? ప్రభుత్వ శాఖ నుంచి పత్రాలు తెప్పించుకొని మీరే (స్పీకర్) పరిశీలించండి’’ అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్ల పురోగతి మందగించిందన్నారు. గతంలో ప్రారంభించిన రోడ్లు కూడా ఆగిపోయాయని, కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రావడం లేదంటున్నారని తెలిపారు. 17 వేల కిలోమీటర్లు రూ.28 వేల కోట్లతో టార్గెట్ పెట్టారని, ఇవన్నీ ఆర్‌అండ్‌బీ రోడ్లేనా, లేక పంచాయతీ రోడ్లో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను యాగాలు చేస్తానని, తనకు భక్తి ఉందని అన్నారు.
హ్యామ్ పేరుతో భారం వేస్తారా?
హ్యామ్ రోడ్లతో పదేళ్లపాటు ఆర్థిక భారం వేస్తారా? రోడ్ల ఎంపిక ఏ విధంగా చేశారు? శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అని బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే, ‘‘ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి కడితే మేం అడ్డం పడుకున్నామా? 57 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చామంటున్నారు.. మరి నియామక పత్రాలు ఇవ్వడానికి టైం ఎందుకు దొరకలేదు? బంగారు తెలంగాణ అంటూ మొత్తం నాశనం చేశారు. మామ, అల్లుడు, కొడుక్కి అటాక్ చేయడం ఒక్కటే తెలుసు.’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం.. రోడ్లు, భవనాల శాఖపై తాము అడిగిన ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి శాసనసభలో తప్పుడు సమాధానం ఇచ్చారంటూ హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి.. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు వెంకట్‌రెడ్డికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మంత్రి సమాధానం పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ ఆధారాలు సమర్పించారు. శాసనసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ఒక ప్రకటనలో ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలోని తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. దళితుడిని సీఎంను చేస్తానని లక్షల సార్లు చెప్పి, మాట తప్పిన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు.