Share News

SLBC Tunnel Accident: నిర్లక్ష్యమే కారణమా?

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:49 AM

స్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తాజా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? పనుల ప్రారంభానికి ముందు టన్నెల్‌ బోర్‌ మిషన్‌ (టీబీఎం) ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఏమరపాటుగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమా?

SLBC Tunnel Accident: నిర్లక్ష్యమే కారణమా?
SLBC Tunnel

  • గతంలోనూ ఊట నీరుతో పనులకు బ్రేక్‌

  • 10 రోజుల క్రితమే పరిశీలించిన జీఎ్‌సఐ

  • ఓకే అన్నాకే 4 రోజుల క్రితం ప్రారంభం

  • పది మీటర్లైనా తవ్వకముందే ప్రమాదం

  • శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఎల్‌ కంటే దిగువకు టన్నెల్‌.. తరచూ ఊట నీరు వచ్చే చాన్స్‌

  • జీఎ్‌సఐ అనుమతి ఎలా ఇచ్చింది?

  • ఎస్‌ఎల్‌బీసీకి ఆది నుంచీ ఆటంకాలే!

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రదినితధి) : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తాజా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? పనుల ప్రారంభానికి ముందు టన్నెల్‌ బోర్‌ మిషన్‌ (టీబీఎం) ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు ఏమరపాటుగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పనులు ప్రారంభించిన ప్రాంతంలో ఒక్క సారిగా ఊట నీరు రావడం, ఆ ధాటికి తేలికపాటి నేల కూలడంతోపాటు పాత, కొత్త సెగ్మెంట్‌ బ్లాకులు (మట్టి కూలకుండా అడ్డుగా బిగించేవి) పడిపోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. అధిక మొత్తంలో ఊట నీరు వస్తుండడం, డీవాటరింగ్‌ చేయడం కష్టమవుతున్న తరుణంలోనే 2019లో సొరంగం పనులను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసీ.. జీఎ్‌సఐ ఎలా అనుమతి ఇచ్చిందన్నదీ అంతుచిక్కడం లేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం వల్లే భారీ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఎస్‌ఎల్‌బీసీ పనులు ఇలా...

ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి సంబంధించి 2005లో జీవో వెలువడగా.. టెండర్లు పూర్తయి 2007లో పనులు ప్రారంభించారు. 2013 వరకు పనులు వేగంగానే నడిచినా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ హయాంలో పనులు నెమ్మదించాయి. శ్రీశైలం ఫుల్‌ రిజర్వాయర్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 ఫీట్లు కాగా.. ఎస్‌ఎల్‌బీసీ హెడ్‌ రెగ్యులేటర్‌ను 854 ఫీట్ల వద్ద చేపట్టారు. వాస్తవానికి ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్‌ టన్నెల్‌ 19.5కిలోమీటర్లకు గాను 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 6,015 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. రెండోవైపున నల్లగొండ జిల్లా మన్నేవారిపల్లి నుంచి ఔట్‌లెట్‌ టన్నెల్‌ 23.980 కిలోమీటర్లకు గాను 20.435 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే, ఇన్‌లెట్‌ సొరంగం తవ్వే కొద్దీ గ్రావిటీకి వీలుగా లోతు సైతం పెరుగుతూ పోయింది. దీంతో సొరంగంలో ఊటనీరు రావడం, పనులు చేస్తున్నప్పుడు మట్టి, రాళ్లు కూలడం నిత్య కృత్యంగా మారింది. సిమెంట్‌, పాలియేరిథిన్‌తో గ్రౌటింగ్‌ చేస్తూ.. సెగ్మెంట్‌ బ్లాకులను అమరుస్తూ తవ్వకం చేపట్టారు. ఈ కారణంగానే 2019లో పనులను నిలిపివేశారు.


నాలుగు రోజుల క్రితమే ప్రారంభం

ఎస్‌ఎల్‌బీసీని రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూములకు నీరివ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,200కోట్లు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఇస్తామని ప్రకటించింది. 10రోజుల క్రితం టీబీఎం ప్రాంతాన్ని పరిశీలించిన జీఎ్‌సఐ అధికారులు.. పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 4రోజుల క్రితమే పనులు ప్రారంభించారు. పది మీటర్లు కూడా తవ్వకకముందే ఉదయం షిఫ్టులో ఒక్కసారిగా మట్టి కూలుతున్న శబ్దం వినిపించడంతో టీబీఎంకు ఇవతలివైపు ఉన్న కార్మికులు బయటపడ్డారు. టీబీఎం వద్ద ఉన్న 8మంది మాత్రం ఇరుక్కుపోయారు. సొరంగంలో 124మీటర్ల మేర మట్టి కూలిపోగా, 8మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నట్లు సమాచారం. లోపల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: రేవంత్ యాక్సిడెంటల్ సీఎం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Boy Death: మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి మృతి

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 23 , 2025 | 11:09 AM