Panchayat Elections: ఎన్నికలు లేవు.. నిధులు రావు
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:31 AM
రాష్ట్రంలో పంచాయతీల పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. అయునా.. వాటికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి.

పంచాయతీలకు సర్పంచులు లేక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,514 కోట్లు
పాలకమండళ్లు ఉంటేనే నిధుల విడుదల
మార్చి 31లోపు ఎన్నికలయ్యే అవకాశం మృగ్యం
ఏడాది నిధులను కోల్పోయే ప్రమాదం
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీల పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది. అయునా.. వాటికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నా.. దీని ఫలితంగా పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా.. అప్పటినుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో తెలంగాణలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం రూ.1,514 కోట్లను కేటాయించింది. కానీ, పంచాయతీల్లో పాలకమండళ్లు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. దీంతో ఏడాదిగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,152 కోట్లను కేటాయిచగా.. ఈ నెల 7వ తేదీ నాటికి రూ.2,109 కోట్లు విడుదలయ్యాయి. కర్ణాటకకు రూ.1,120 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మాత్రమే సర్పంచ్‌లు లేనికారణంగా నిధులు విడుదల కాలేదు. ఈ నిధులను కోల్పోవాల్సి వస్తుందన్న కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10వతేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ, సామాజిక పరిస్థితులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థికసంఘం నిధులపై సందిగ్ధం నెలకొంది.
నిధుల విడుదలలో నిక్కచ్చిగా కేంద్రం..
నిధుల విడుదలలో కేంద్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. 15వ ఆర్థిక సంఘం నుంచి గడచిన నాలుగేళ్లలో (2020-21 నుంచి 2023-24 వరకు) తెలంగాణలోని పంచాయతీలకు రూ.6,051 కోట్లు రాగా, ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఒక్క రూపాయి రాకపోవడమే ఇందుకు నిదర్శనం. 2024 ఫిబ్రవరిలో పాలకమండళ్ల పదవీకాలం ముగియడంతో.. ఆ తరువాత నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమయ్యే నాటివరకే లెక్కించి నిధులను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.1,430 కోట్లలో రూ.6 కోట్లను తగ్గించి రూ.1,424 కోట్లనే విడుదల చేయడం గమనార్హం. కాగా, దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం 2026 వరకు ఉంటుంది. ఈ ఐదేళ్ల (2021 నుంచి 2026 వరకు) కాలానికి పంచాయతీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కోసం కేంద్రం రూ.2,36,805 కోట్లను కేటాయించింది. ఇందులో తెలంగాణకు రూ.7,565 కోట్లు రావాల్సి ఉంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ మినహా మిగిలిన 28 రాష్ర్టాలకు కలిపి రూ.60,750 కోట్లను కేటాయించింది. వీటిలో తెలంగాణకు రూ.1,514 కోట్లను ప్రకటించింది. కానీ, పంచాయతీల్లో పాలకమండళ్లు లేని కారణంగా ఇవి అందలేదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే.. అంటే మార్చి 31లోగా పాలకమండళ్లు ఏర్పడితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని సర్కారు భావించింది. అందుకోసమే మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినా.. కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2024-25కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు రాష్ట్రానికి అందే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇస్తారా.!
రాష్ట్రంలోని పంచాయతీల్లో పాలకమండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదన్నది స్పష్టమవుతోంది. వచ్చే మార్చి 31తో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ తరువాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం గడువు కూడా వచ్చే మార్చితోనే ముగియనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయని నిధులు వచ్చే ఏడాదికి బదిలీ అవుతాయా? అందుకు అవకాశాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఏడాదికి కేటాయించిన నిధులు నిలిచిపోతే.. తర్వాత ఏడాదికి బదిలీ చేసే వెసులుబాటు కేంద్రానికి ఉంటుంది. అది కేంద్రం విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కానీ, రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు ఇలా నిధులను కేంద్రం బదిలీ చేస్తుందా అన్నది ప్రశ్నార్థకమే.
ఇప్పటివరకు 15వ ఆర్థిక సంఘం
కింద విడుదలైన నిధులు.. రూ.కోట్లలో
సంవత్సరం కేటాయింపు విడుదల
2020-21 1,847 1,847
2021-22 1,365 1,365
2022-23 1,415 1,415
2023-24 1,430 1,424
2024-25 1,514 ------