CM Revanth Reddy: కేంద్రం అంటేనే మిథ్య!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:58 AM
తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ భూషణ్ సిఫార్సు చేస్తే తిరస్కరించడమే కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మీద అవాకులు చవాకులు పేలడం దుర్మార్గమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి
గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా?
ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానం
బీజేపీ ఆఫీసు వీధికి గద్దర్ పేరు పెడతాం జాగ్రత్త
గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ భూషణ్ సిఫార్సు చేస్తే తిరస్కరించడమే కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మీద అవాకులు చవాకులు పేలడం దుర్మార్గమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాలుగా దేనికదే విడిపోతే కేంద్రం ఒక మిఽథ్య అని రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల కలయికే కేంద్రం అని చెప్పారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవించక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తే దానికి సమాధానం ఇవ్వడం పోయి గద్దర్‌ను కించపరుస్తూ మాట్లాడి మంత్రి తెలంగాణను అవమానించారన్నారు. గద్దరన్నకు వ్యతిరేకంగా గానీ, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేలా గానీ బీజేపీ నాయకులు మరొకసారి మాట్లాడితే, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న వీధికి గద్దర్ పేరు పెట్టి, రోజూ చిరునామాలో రాసుకుంటూ ఆయన నామ స్మరణ చేసుకొనేట్లు చేస్తామని హెచ్చరించారు. ‘‘పద్మ అవార్డులు బీజేపీ చేతిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఏం చేయగలడులే అనుకుంటున్నారేమో, మీ రాష్ట్ర కార్యాలయం గద్దరన్న పుట్టిన రాష్ట్రంలో ఉందన్న సంగతి మర్చిపోవద్దు.
ప్రతి దానికి మా దగ్గర మందు ఉంది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వానికి అంత అహంకారం పనికిరాదన్నారు. గతంలో గద్దర్‌ను ఇదే విధంగా గేటు బయట కూర్చోబెట్టిన పాపానికి ఒకాయన ఇప్పుడు గేటు దగ్గర కూర్చోని తనను ఎవరు పలకరిస్తారా? అని ఎదురు చూస్తున్నాడని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు ఓట్ల విప్లవంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, అప్పుడు రాహుల్‌గాంధీకి చెప్పి గద్దర్‌ను ఇంకా ఘనంగా గౌరవించుకుంటామని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ఆయన 77వ జయంతి ఉత్సవాలు శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధుడై సమ సమాజ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడిన గద్దరన్నను ఒక సైద్ధాంతిక వ్యక్తిగానే చూడాలని అన్నారు. ఆయన విప్లవ సిద్ధాంతంతో తాము కూడా విభేదిస్తున్నప్పటికీ ఆ సిద్ధాంతమే అసలు ఉండకూడదనే ధోరణిని ఖండిస్తున్నానని చెప్పారు.
గద్దర్‌కు పద్మ భూషణ్ తో పాటు పద్మశ్రీ పురస్కారానికి చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లను తెలంగాణ నుంచి ప్రతిపాదించామని సీఎం తెలిపారు. ఈ ఐదుగురిలో ఏ ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని గుర్తు చేశారు. వారిలో తమతో రాజకీయంగా విభేదించిన గోరటి వెంకన్న లాంటి వారు కూడా ఉన్నారన్నారు. వారెవరూ అడగకుండానే తెలంగాణ సమాజానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని తన బాధ్యతగా సిఫార్సు చేశామని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చారని, ఈ ఐదుగురు తెలంగాణ బిడ్డలు ఆ ఐదుగురి కన్నా ఏ రకంగా తక్కువని ప్రశ్నించారు. బీజేపీతో ఉన్నవాళ్లను సత్కరిస్తాం, విభేదించిన వారిని దూరం పెడతాం అన్న సంస్కృతి సరి కాదని చెప్పారు. పాశం యాదగిరి తమను ఇష్టానుసారంగా తిడుతుంటారని, అయినా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తించి గౌరవించుకున్నామని ప్రస్తావించారు.
నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారక సభామందిరంతో పాటు మ్యూజియం నిర్మాణం చేపడతామని గతేడాది ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గద్దర్ తనయుడు సూర్యం స్మారక నిర్మాణం తాలూకు డిజైన్‌ను సీఎంకు సభాముఖంగా నివేదించారు. మంత్రివర్గ సహచరులతో చర్చించి త్వరలోనే ఆచరణలోకి తెస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గద్దర్ విశ్వమానవుడు అన్నారు. గద్దర్ ఈ నేల మీద పుట్టడం తెలంగాణ అదృష్టం అని చెప్పారు.ఈ ఉగాదికి చరిత్రలో నిలిచిపోయే విధంగా గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని భట్టి ప్రకటించారు. ఆ బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారన్నారు. సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, కె.శ్రీనివాస్, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, గోరటి వెంకన్న, గద్దర్ భార్య విమల, తెలంగాణ సాంస్కృతిక సారధి వెన్నెల, కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ సమక్షంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట - ఆట తో సభను ఉర్రూతలూగించారు. డోలు, డప్పు లేవని గోరటి ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని డప్పు కళాకారులను పిలిపించారు.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి