Sridhar Babu: న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:42 AM
న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ బిల్లులను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, బార్ కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఈ బిల్లులను రూపొందించామని, ప్రస్తుతం ఒక్కో కేసుకు రూ.100 టికెట్ వసూలు చేస్తున్నారని, దానిని రూ.250కి పెంచుతున్నామని తెలిపారు.

కొత్త హైకోర్టు ఆవరణలో లా వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ బిల్లులను శాసనసభ శుక్రవారం ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, బార్ కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఈ బిల్లులను రూపొందించామని, ప్రస్తుతం ఒక్కో కేసుకు రూ.100 టికెట్ వసూలు చేస్తున్నారని, దానిని రూ.250కి పెంచుతున్నామని తెలిపారు. ఇందులో రూ.215 న్యాయవాదుల సంక్షేమ నిధికి, రూ.35 గుమాస్తాల సంక్షేమ నిధికి వెళ్తాయని చెప్పారు. ఈ నిధుల నుంచి న్యాయవాదులు, గుమాస్తాలకు సంబంధించి ఆరోగ్య బీమా, పింఛన్, జీవితబీమాలకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. న్యాయవాదుల రక్షణ బిల్లుపై తాము ఇచ్చిన హమీకి కట్టుబడి ఉన్నామని, ఈ బిల్లు తయారీపై కసరత్తు జరుగుతోందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
అప్పట్లో న్యాయవాద దంపతులను పట్టపగలే హత్య చేసిన విషయం ఇంకా కళ్లలో మెదలుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంక్షేమనిధిని రూ.200 కోట్లకు పెంచాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. వంద ఎకరాల స్థలంలో నిర్మించనున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనను కూడా హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు.