Share News

అందరి లెక్కా తేలుస్తాం...

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:18 AM

సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ.. రైతుబంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నంబర్లవారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

అందరి లెక్కా తేలుస్తాం...

ఆ భూమిలో పెట్రోల్‌ బంకు ఉంది. అయినా దానికి రైతుబంధు ఇచ్చారు! ఫంక్షన్‌ హాల్‌ ఉన్న భూమికీ రైతుబంధు అందింది!! కొండలు.. గుట్టలు.. చెరువులు.. లేఅవుట్లు.. ఇలా సాగుతో సంబంధంలేని భూములెన్నింటికో గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో రైతు బంధు అందిన తీరు అధికారుల సర్వేలో బయటపడుతోంది!! ఈ నెల 17 దాకా జరిగిన సర్వేలో అలాంటి భూములు రెండు లక్షల ఎకరాల దాకా ఉన్నట్టు తేలింది. గ్రామ సభలు ముగిసిన తర్వాత మళ్లీ సర్వే మొదలుపెట్టి భూములన్నిటి లెక్కా పక్కాగా వెలికితీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • రైతు భరోసాకు అర్హం కాని భూములు..

  • రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2లక్షల ఎకరాలు

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 76 వేల ఎకరాలు

  • ఉమ్మడి నల్లగొండలో 20,277 ఎకరాలు.. సంగారెడ్డి జిల్లాలో 15,314 ఎకరాలు

  • మేడ్చల్‌లో 14,300 ఎకరాలకు కట్‌..

  • గ్రామసభల నేపథ్యంలో సర్వే వాయిదా

  • పూర్తయితే.. పెరగనున్న అర్హంకాని భూములు!

హైదరాబాద్‌, రంగారెడ్డి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ.. రైతుబంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నంబర్లవారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ 33 జిల్లాల పరిధిలో సాగుకు యోగ్యం కాని భూములను దాదాపు రెండు లక్షల ఎకరాల దాకా గుర్తించిన అధికారులు.. వాటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇదంతా ఈ నెల 17వ తేదీ వరకూ తేలిన లెక్క. ఆ తర్వాత గ్రామసభలు ప్రారంభం కావడంతో భూముల సర్వేకు కొంత బ్రేక్‌ పడింది. శుక్రవారంతో గ్రామసభలు ముగియనుండటంతో.. మిగిలిన గ్రామాల్లో కూడా సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తియ్యనున్నారు.


ఇప్పటిదాకా అందిన లెక్కల ప్రకారం.. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సాగుకు యోగ్యం కాని దాదాపు 76 వేల ఎకరాల భూమికి రైతు బంధు అందినట్టు అధికారుల విచారణలో తేలింది. ఇందులో ఎక్కువ భూములు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డిజిల్లాలో అత్యధికంగా 54,200 ఎకరాలు., మేడ్చల్‌ జిల్లాలో 14300 ఎకరాలు.. వికారాబాద్‌లో 7500 ఎకరాల మేర భూములు సాగుకు యోగ్యం కానివని తేల్చారు. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం భూముల్లో 18.33 శాతం భూములను అర్హత లేని భూములుగా గుర్తించడం గమనార్హం. ఒక్క ఘట్‌కేసర్‌ మండలంలో 4222 ఎకరాలను ఇలా గుర్తించారు. అలాగే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డివిజన్‌లో 173 గ్రామ పంచాయతీల్లో.. 1349.19 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూములు ఉన్నట్లు తేలింది. జనవరి 26న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు.. ఆలోగా అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ వ్యవసాయేతర భూములన్నింటినీ జాబితా నుంచి తొలగిస్తున్నారు.


వాటికి ఇవ్వలేం

అర్హత లేని భూములకు కూడా రైతుబంధు పొందుతున్నవారు.. ఇప్పుడు విచారణకు వస్తున్న రెవెన్యూ అధికారులను ఆ పథకం నుంచి తమ భూములను తొలగించ వద్దని, రైతు భరోసా కూడా అందేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు. రూ.కోట్ల విలువ జేసే భూముల్లో ఒకపక్క వాణిజ్య కార్యకాలాపాలు నిర్వహిస్తూనే.. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం అందించనున్న రూ.12 వేల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను రైతు భరోసా జాబితాలో పెట్టేందుకు ససేమిరా అంటున్నారు.


వెంచర్లు.. కోళ్లఫారాలు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. ముఖ్యంగా నగర శివార్లలో గత కొన్నేళ్లుగా కాలనీల్లోని భూములు, వెంచర్లు, కోళ్లఫారాలు, క్రికెట్‌ గ్రౌండ్లు, ఫంక్షన్‌ హాళ్లు, పరిశ్రమలు ఉన్న భూములకు సైతం రైతుబంధు కింద రూ.కోట్లు చెల్లిస్తున్నారు. అప్పట్లో భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసిన వారు మ్యుటేషన్‌ చేయించుకోకపోవడంతో పలు చోట్ల పాత రైతుల పేర్లే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఆయా భూముల్లో కాలనీలు ఏర్పాటై పెద్దఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ధరణి వచ్చిన తరువాత మ్యుటేషన్‌ లేని భూములకు కొత్త పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ఇలాంటి వారందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బు జమవుతోంది. ఇక బీడు భూముల సంగతి సరేసరి. ఇలాంటి వాటిని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ వెలికి తీసి ప్రత్యేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఔటర్‌ రింగురోడ్డు, జాతీయ రహదారులకు కొన్నేళ్లు కిందట సేకరించిన భూములకు సైతం రైతుబంధు ఇస్తున్న విషయం వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం వీటన్నింటిపైనా విచారణకు ఆదేశించింది.

జిల్లా వ్యవసాయేతర

భూమి

(ఎకరాల్లో)

రంగారెడ్డి 54,200

మేడ్చల్‌ 14,300

వికారాబాద్‌ 7,500

కరీంనగర్‌ 5,600

పెద్దపల్లి 2,677

జగిత్యాల 5,088

ఖమ్మం 6,359

రాజన్న సిరిసిల్ల 3,200

అసిఫాబాద్‌ 1,800

నిజామాబాద్‌ 7,520

సంగారెడ్డి 15,313

సిద్దిపేట 13,210

మెదక్‌ 4,650

కామారెడ్డి 7,525

మంచిర్యాల 102

ఉమ్మడి నల్లగొండ 20,277

కొత్తగూడెం 2,800

నిర్మల్‌ 4,915

ఆదిలాబాద్‌ 1,034

Updated Date - Jan 24 , 2025 | 03:18 AM