CM Revanth Reddy: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 15 , 2025 | 02:22 PM
CM Revanth Reddy: న్యూఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, జనవరి15: కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంత ఘన చరిత్ర ఉన్న ఈ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమంతోపాటు అభివృద్ధి కోసం పాటు పడిందని ఆయన గుర్తు చేశారు. ఇన్నేళ్లు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోందన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. నిన్న కాకుండా మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అలాగే ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొ్న్నారు. దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం వేదికగా ప్రణాళికలు రచించబోతున్నామని జోస్యం చెప్పారు.
రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దశ దిశ నిర్ధారిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు విధి విధానాలు రూపొందిస్తామన్నారు. దేశ ప్రజలకు ఇది పండగ రోజు అని ఆయన అభివర్ణించారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ రోజు అద్భుతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక వేదిక కాబోతుందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరామన్నారు. అపాయింట్‌మెంట్ వచ్చిన వెంటనే వారిని కలిసి.. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తామన్నారు.
For Telangana News And Telugu News