యాడిట్ పెట్టండి.. ఎంత ఖర్చయినా భరిస్తాం!
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:05 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట నుంచి) 14 కిలోమీటర్ల వద్ద యాడిట్ (సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం) పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు చెప్పారు.

సొరంగం నుంచి బయటికెళ్లే ద్వారం ఏర్పాటు చేయండి
అధికారులకు ఉత్తమ్ సూచన
14 కి.మీ. వద్ద ఏర్పాటు..
అర్వింద్‌కుమార్ ప్రతిపాదన
ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట నుంచి) 14 కిలోమీటర్ల వద్ద యాడిట్ (సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం) పెట్టడానికి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు చెప్పారు. అందుకు ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గురువారం సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన ఆయన దోమలపెంటలో అధికారులతో సమీక్ష చేశారు. నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ)కి చెందిన నిపుణులు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారని రెవెన్యూ(విపత్తులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంత్రికి నివేదించారు. ప్రతి షిఫ్టులో 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఇన్‌లెట్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద ఒక యాడిట్ పెడితే.. మున్ముందు సహాయక చర్యలు, టన్నెలింగ్ పనులు, నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుందని అర్వింద్‌కుమార్ గుర్తు చేయగా.. తగిన అనుమతి తీసుకొని పనులు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.
యాడిట్ నిర్మాణానికి ఎంత ఖర్చయినా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మాణ సంస్థ (జేపీ అసోసియేట్) ప్రతినిధులకు తెలిపారు. సహాయక పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. సహాయక చర్యలకు అడ్డంగా ఉన్న వస్తువులను తొలగించడానికి రైల్వే నుంచి ప్లాస్మా కటింగ్ మిషన్, బ్రోకో కటింగ్ మిషన్, అలా్ట్ర థర్మిక్ కటింగ్ మిషన్‌లు వినియోగిస్తున్నామని మంత్రికి అధికారులు నివేదించారు. గురువారం ఉదయం వెళ్లగానే అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. మళ్లీ సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విపత్తు దళానికి చెందిన నిపుణులు దెబ్బతిన్న కన్వేయర్‌ను తొలగిస్తే సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని నివేదించగా.. కన్వేయర్ తొలగిస్తే మళ్లీ మరమ్మతులు చేయడం కష్టమని, సహాయక చర్యల కోసం లోకో ట్రైన్‌ను వినియోగించుకోవాలని, పరికరాలన్నీ సొరంగంలోకి లోకో ట్రైన్ తీసుకెళుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు గుర్తు చేశారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రదేశం కచ్చితంగా ఎక్కడ ఉంది? చిక్కుకున్నవారు ఎక్కడున్నారనే వివరాలు కనుక్కోవడానికి వీలుగా గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) యంత్రాన్ని పంపించారు. ఈ యంత్రం గురువారం రాత్రికల్లా వివరాలతో బయటికి రానుందని అధికారులు చెబుతున్నారు.