Share News

డాక్టర్‌.. గుండెనొప్పి అమ్మా..కడుపునొప్పి

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:02 AM

కడప రిమ్స్‌లో నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పిగా ఉన్నదని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్‌ కావచ్చునని అనుమానంగా ఉందని మరోసారి వైద్యులను ఆయన టెన్షన్‌ పెట్టారు.

డాక్టర్‌.. గుండెనొప్పి అమ్మా..కడుపునొప్పి

  • సార్‌.. కేన్సర్‌ ఉందేమో.. కడప రిమ్స్‌లో పోసాని ‘ఆపసోపాలు’

  • మూడుగంటలపాటు పరీక్షలు.. ఏమీ లేదని తేల్చిన వైద్యులు

రాజంపేట/కడప, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : కడప రిమ్స్‌లో నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ నానా ‘ఆపసోపాలు’ పడ్డారు. గుండెలో నొప్పిగా ఉన్నదని ఒకసారి.. కడుపునొప్పి అంటూ ఇంకోసారి.. కేన్సర్‌ కావచ్చునని అనుమానంగా ఉందని మరోసారి వైద్యులను ఆయన టెన్షన్‌ పెట్టారు. చివరకు.. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చేశారు. దీంతో తిరిగి ఆయనను రాజంపేట సబ్‌జైలుకు తరలించారు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ను, వారి కుటుంబసభ్యులను దూషించిన కేసులో పోసాని జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. తనకు గుండెలో నొప్పిగా ఉందని శనివారం మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్‌ మల్‌రెడ్డికి తెలియజేశారు.


వెంటనే పోసానిని రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో స్వల్ప తేడా ఉందని గమనించి.. మెరుగైన వైద్య చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడా పరీక్షలు చేశారు. అయితే అందులో అంతా నార్మల్‌గా ఉందని తేలింది. కడుపులో నొప్పిగా ఉన్నదని పోసాని అనడంతో స్కానింగ్‌ చేశారు. కిడ్నీలో చిన్న సైజు రాయి ఉన్నట్టు గుర్తించారు. దానికి సర్జరీ అవసరం లేదని, మాత్రలతో కరిగిపోతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల కేన్సర్‌ ఉందనే అనుమానంతో టెస్ట్‌ చేయించుకున్నానని, మళ్లీ చెకప్‌ చేయాలనగా, వైద్యులు టెస్ట్‌లు చేశారు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని తేల్చారు. ఇలా మూడు గంటలకుపైగా పరీక్షలు నిర్వహించారు. చివరకు ఆస్పత్రిలో ఉంచి వైద్యసేవలు అందించాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో.. తిరిగి రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.

Updated Date - Mar 02 , 2025 | 04:02 AM