డామిట్ కథ అడ్డం తిరిగింది.. చైనా నటికి చేదు అనుభవం!

ABN , First Publish Date - 2021-02-06T01:11:08+05:30 IST

చైనాకు చెందిన ఓ యువ నటి.. కాస్మోటిక్ సర్జరీ ద్వారా తన ముఖంలో కొద్దిగా మార్పులు చేసుకుని.. భారీ స్థాయిలో అవకాశాలను కొల్లగొట్టాలని ఆశపడింది. కానీ తానొకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచింది

డామిట్ కథ అడ్డం తిరిగింది.. చైనా నటికి చేదు అనుభవం!

బీజింగ్: చైనాకు చెందిన ఓ యువ నటి.. కాస్మోటిక్ సర్జరీ ద్వారా తన ముఖంలో కొద్దిగా మార్పులు చేసుకుని.. భారీ స్థాయిలో అవకాశాలను కొల్లగొట్టాలని ఆశపడింది. కానీ తానొకటి తలిస్తే.. విధి ఇంకోటి తలచింది. దీంతో ఆ నటికి కొత్త అవకాశాలు రావడం అటుంచితే.. చివరికి తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లనే పోగొట్టుకుని ప్రస్తుతం ఊసూరుమంటోంది. ఈ క్రమంలో తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘ఇలాంటి పిచ్చి పని ఎవరూ చేయొద్దని’ నెటిజన్లకు సూచిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన గావో లియూ అనే యువతి.. తన పాటలతో, నటనతో ప్రజలను మెప్పించింది. దీంతో ఆమెకు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తన ముక్కును కొద్దిగా ట్రిమ్ చేయించుకుని తన అందాన్ని మరింత పెంచుకోవాలని భావించింది. తద్వారా భారీ స్థాయిలో అవకాశాలు కొల్లగొట్టొచ్చని లియూ ఆశ పడింది. అదే విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పి.. ఆమె సలహాతో ఓ డాక్టర్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి.. కాస్మోటిక్ సర్జరీ కూడా చేయించుకుంది. 



అయితే.. తాను ఒకటి తలుస్తే.. విధి ఇంకోటి తలచింది. లియూ చేయించుకున్న కాస్మోటిక్ సర్జరీ విఫలమవ్వడంతో.. ముక్కు చివరన కణజాలం పూర్తిగా దెబ్బతిని, ఆ ప్రాంతం అంతా నల్లగా మారిపోయింది. దీంతో కొత్త అవకాశాలు అటుంచితే.. తన చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోయాయి. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ప్రజలకు ఆమె తన ముఖాన్ని చాటేసింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో లియూ.. తన ఫొటోలను షేర్ చేయడంతోపాటు తన చేదు అనుభవాన్ని నెటిజన్లకు వివరించింది. అంతేకాకుండా ‘ఇటువంటి పిచ్చి పని ఎవరూ చేయొద్దని’ సూచించింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపిన లియూ.. కొద్ది రోజుల్లోనే మళ్లీ సినిమాల్లో నటిస్తానని వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం లియూ సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో కాస్మోటిక్ సర్జరీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


Updated Date - 2021-02-06T01:11:08+05:30 IST

News Hub