Vangaveeti Radha: వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తే వంగవీటి రాధా ఏ రేంజ్ ఝలక్ ఇచ్చారంటే..
ABN , First Publish Date - 2022-12-26T15:30:18+05:30 IST
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణను (Vangaveeti Radha Krishna) తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ నేతలు (YCP Leaders) కుయుక్తులు పన్నుతున్నారా? ఇందుకు ఆయన తండ్రి వంగవీటి రంగా (Vangaveeti Ranga) విగ్రహావిష్కరణను..
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణను (Vangaveeti Radha Krishna) తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ నేతలు (YCP Leaders) కుయుక్తులు పన్నుతున్నారా? ఇందుకు ఆయన తండ్రి వంగవీటి రంగా (Vangaveeti Ranga) విగ్రహావిష్కరణను అస్త్రంగా ఉపయోగించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారా? అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం నున్నలో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఎప్పుడూ లేనిది వైసీపీ నేతలు భారీగా రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెరలేపడం, రంగా అభిమానులను భారీగా సమీకరించడం కుయుక్తిలో భాగమేనని చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ నేరుగా రాధా ఇంటికి వెళ్లి ఆయన్ను వెంట పెట్టుకుని సభాస్థలికి ఒకే కారులో రావడంతో కొత్త సంకేతాలు పంపినట్టయింది.
విజయవాడ రూరల్: స్థానిక హైస్కూల్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు వంగవీటి రాధా, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బోడపాడు నుంచి ర్యాలీగా వెళ్లిన నేతలు, రంగా అభిమానులు సభాస్ధలి వద్దకు చేరుకున్నారు. ముందుగా రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన నేతలు అనంతరం జరిగిన సభలో ప్రసింగిచారు. బాలశౌరి, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి రంగా అని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిగా ఎప్పటికి ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలచిపోయారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ తన తండ్రి రంగా ప్రజలను ఎప్పుడూ శాసించలేదని, ప్రజలే ప్రభుత్వాలను శాసించేలా ప్రజాస్వామ్య పాలన నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నున్న గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కాటూరి సరళ, ఎంపీపీ ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సువర్ణరాజు, నేతలు జీతం శ్రీను, అంగజాల హనుమ, అవుతు శ్రీనివాసరెడ్డి, విగ్రహ దాత కె. రవికుమార్ పాల్గొన్నారు.
కొడాలి నానీకి రాధా కౌంటర్
రంగా విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాధా సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. రాధాకు విజయవాడలో సొంత ఇల్లు కూడా లేదని ఎక్కడో గుంటూరు జిల్లాలో వ్యవసాయ భూమిలో ఉంటున్నాడని, ఆయన అడిగితే వెయ్యి ఇళ్లు అయినా ఇచ్చేవారు ఉన్నారని నాని అన్నారు. అంతటితో ఆగకుండా ఏ పదవి ఇస్తామన్నా వద్దంటాడని, రాజ్యసభ సీటు ఇస్తామన్నా చలించడని చెప్పుకొచ్చారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలపై రాధా స్పందిస్తూ పదవులు శాశ్వతం కాదని, ఐదేళ్లకు వచ్చి పోయే పదవులపై తనకు ఆశలేదని రంగా కొడుకుగా తనకు దక్కిన గౌరవమే పెద్ద పదవని సున్నితంగా కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ విగ్రహం వద్ద కారు దిగని రాధా
రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ ఒకే కారులో వచ్చారు. అయితే నున్న చెరువు సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు కారు దిగి వెళ్లగా రాధా కారులోనే కూర్చున్నారు. రాధా కారు దిగకపోవడంతో ఎంపీ, ఎమ్మెల్యేలు పూలమాల వేసి ముందుకు సాగారు. అనంతరం రాధా సభాస్థలి వద్దకు చేరుకున్నారు.
శిలాఫలకం ప్రారంభించని నేతలు
రంగా విగ్రహావిష్కరణతో పాటుగా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసేందుకుగాను అధికారులు విగ్రహం కింద శిలాఫలకం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సిన నేతలు ఆవిష్కరించకుండానే వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక అక్కడి వారే శిలాఫలకానికి ఏర్పాటు చేసిన తెరను తొలగించి కార్యక్రమాన్ని మమ అనిపించారు.
సోమవారం ఏం జరిగిందంటే..
వంగవీటి రాధాను దగ్గర చేసుకుని రాజకీయ లబ్ది పొందాలని చూసిన వైసీపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వంగవీటి రాధా వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు. టీడీపీ, జనసేన నేతలతో మాత్రమే కలిసి రంగా వర్ధంతిలో రాధా పాల్గొన్నారు. రాధాను తమ వైపునకు తిప్పుకునేందుకు ఆదివారం అంతా వైసీపీ చేసిన ప్రయత్నాలు రాధా వ్యవహరించిన తీరుతో బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. వైఎస్ విగ్రహానికి పూలమాల వేయకుండా రాధా దూరంగా ఉండటం కూడా వైసీపీని మరింత నిరాశపరిచింది. వైసీపీ నేతలను వంగవీటి రంగా అభిమానులు దగ్గరకు కూడా రానివ్వకపోవడం గమనార్హం.