పరువు హత్య కేసులో తండ్రి అరెస్టు

ABN , First Publish Date - 2022-11-06T01:31:04+05:30 IST

బాలిక హత్య కేసులో నిందితుడైన కన్న తండ్రిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఎల్‌.రేవతమ్మ తెలిపారు.

పరువు హత్య కేసులో తండ్రి అరెస్టు

ప్రేమ వ్యవహారం నచ్చక కుమార్తెను హత్య చేసినట్టు అంగీకారం

బెల్ట్‌తో పీక నులిమి ఘాతుకం

మహారాణిపేట, నవంబరు 5: బాలిక హత్య కేసులో నిందితుడైన కన్న తండ్రిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఎల్‌.రేవతమ్మ తెలిపారు. నగరంలోని వన్‌టౌన్‌ రెల్లివీధిలో లిఖిత శ్రీ (15) శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చక తండ్రే (వడ్డాది వరప్రసాద్‌) ఆమెను బెల్ట్‌తో పీక నులిమి చంపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పరువు హత్యకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెల్లివీధిలో వరప్రసాద్‌ (45)...భార్య హేమలత, ఇద్దరు కుమార్తెలతో కలసి ఉండేవారు. అయితే హేమలత 13 ఏళ్ల క్రితం భర్త నుంచి దూరమై విడిగా ఉంటోంది. దీంతో ఇద్దరు కుమార్తెలను వరప్రసాద్‌ చూసుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దీంతో చిన్న కుమార్తె లిఖితశ్రీని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. దండుబజార్‌ సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లిఖితశ్రీ స్థానికంగా వుంటున్న ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడిపై అనేక నేరారోపణలు వుండడంతో కుమార్తె ప్రేమను వరప్రసాద్‌ అంగీకరించలేదు. అతడితో మాట్లాడవద్దని, అలాంటి వారితో ప్రేమ వ్యవహారాలు నడిపితే చాలా ఇబ్బందులు పడతావని, బుద్ధిగా చదువుకోవాలని నచ్చజెప్పాడు. అయితే తండ్రి మాటలను పట్టించుకోకుండా బాలిక నాలుగైదు రోజుల క్రితం ఆ యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తండ్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల రెండో తేదీన వారిని గుర్తించి...ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. శుక్రవారం వరప్రసాద్‌ తల్లి తద్దినం పూజాది కార్యక్రమాలు ఇంటిలో లిఖితశ్రీతోనే నిర్వహించారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ సాయంత్రం సుమారు నాలుగు, ఐదు గంటల సమయంలో వర ప్రసాద్‌ ఇంటి నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోవడాన్ని పై అంతస్థులో నివాసం వుంటున్న బాలిక పిన్ని గమనించింది. వెంటనే కిందకు వెళ్లిచూడగా బాలిక అచేతన స్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలో వున్న కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందజేయడంతో వన్‌టౌన్‌ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని కేసు విచారణ చేపట్టారు. అయితే బాలిక తండ్రి వర ప్రసాద్‌ తన కుమార్తెను తానే బెల్ట్‌తో పీక నులిమి చంపానని, ప్రేమ వ్యవహారం తనకు నచ్చకే హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరిస్తూ పోలీసులకు లొంగిపోయాడు. బాలిక తల్లి హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-06T01:31:07+05:30 IST