Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2022-11-09T21:25:09+05:30 IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో వాయువ్యంగా పయనించి మరింత బలపడనున్నది.

Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో వాయువ్యంగా పయనించి మరింత బలపడనున్నది. ఈ క్రమంలో ఈనె 11వ తేదీ రాత్రికి తమిళనాడు, పుదుచ్చేరి (Tamil Nadu Puducherry) మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పాటుతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో మేఘాలు ఆవరించాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈనెల 11 నుంచి 13 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 11, 12 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు దక్షిణ కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం వున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

Updated Date - 2022-11-09T21:25:11+05:30 IST