Tushar Gandhi: గాడ్సేకి సహకరించిన సావర్కర్, గాంధీ ముని మనుమడి సంచలన ఆరోపణ
ABN , First Publish Date - 2022-11-21T17:01:56+05:30 IST
వినాయక్ దామోదర్ సావర్కర్ పిరికివాడని, బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరుతూ సంతకం చేశారని రాహుల్ గాంధీ చేసిన సంచలన..
న్యూఢిల్లీ: వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) పిరికివాడని, బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరుతూ సంతకం చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన సంచలన ఆరోపణల దుమారం తగ్గకముందే దీనికి కొనసాగింపుగా సావార్కర్‌పై మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ (Tushar Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. మహాత్మాగాంధీని చంపేందుకు నాథూరాం గాడ్సే (Nathuram Godse)కు తుపాకీని సావర్కర్ సమకూర్చాడని ఆరోపించారు. ''సావర్కర్ బ్రిటిష్ వారికి సహకరించడం మాత్రమే కాదు, బాపూని (గాంధీ) చంపేందుకు తుపాకీని సమకూర్చడంలో కూడా నాథూరాం గాడ్సేకు సహకరించారు'' అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. బాపూ హత్యకు రెండ్రోజుల ముందు వరకూ కూడా గాడ్సే వద్ద తుపాకీ లేదని అన్నారు.
ఇది ఆరోపణ కాదు, చరిత్రలో రికార్డయింది..
కాగా, తన ప్రకటనపై తుషార్ గాంధీ మీడియాకు మరింత వివరణ ఇస్తూ, తాను చేసింది ఆరోపణ కాదని, చరిత్రలో ఈ విషయం నమోదైందని చెప్పారు. అదే విషయం తాను చెప్పానన్నారు. ''పోలీసు రికార్డుల ప్రకారం 1948 జనవరి 26, 27 తేదీల సమయంలో నాథూరాం గాడ్సే, వినాయక్ అప్టేలు సావర్కర్‌ను కలుసుకున్నారు. అప్పటి వరకూ గాడ్సే వద్ద తుపాకీ లేదు. గన్ కోసం ముంబై అంతా ఆయన వెదికారు. ఈ పర్యటన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి గ్వాలియర్ వెళ్లారు. అక్కడ ఆయనకు మంచి పిస్తోల్ లభ్యమైంది. బాపూ హత్య జరగడానికి రెండ్రోజుల ముందు ఇదంతా జరిగింది. అదే నేను చెప్పదలచుకున్నది. కొత్తగా చేసిన ఆరోపణలంటూ ఏమీ లేవు'' అని తుషార్ గాంధీ వివరణ ఇచ్చారు.