Super Star Krishna: ‘జయ విజయ’లతో జైత్రయాత్ర

ABN , First Publish Date - 2022-11-15T18:37:17+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) నట ప్రస్థానమంతా ‘జయ విజయ’ (Jaya Vijaya) మయమేనని చెప్పాలి. జయ, విజయ.. ఈ రెండు పేర్లు ఉన్న నాయికలతోనే ఆయన జైత్రయాత్ర చేశారని చెప్పలి. ఆరంభంలో..

Super Star Krishna: ‘జయ విజయ’లతో జైత్రయాత్ర

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) నట ప్రస్థానమంతా ‘జయ విజయ’ (Jaya Vijaya) మయమేనని చెప్పాలి. జయ, విజయ.. ఈ రెండు పేర్లు ఉన్న నాయికలతోనే ఆయన జైత్రయాత్ర చేశారని చెప్పలి. ఆరంభంలో ‘పదండి ముందుకు’, ‘కులగోత్రాలు’, చిత్రాల్లో బిట్ రోల్స్ వేసిన కృష్ణకు ‘తేనెమనసులు’ సినిమాలోనే పూర్తి స్థాయిలో నాయిక దొరికింది. ఆమె సుకన్య (Sukanya). రెండో సినిమా ‘కన్నె మనసులు’లో కృష్ణ సరసన సంధ్యారాణి (SandhyaRani) నటించింది. అప్పట్లో వారిద్దరూ కొత్తవారే. కృష్ణ కూడా కొత్తే. ఆ తర్వాత సోలో హీరోగా స్టార్‌డమ్ తీసుకువచ్చిన చిత్రం ‘గూఢచారి 116’ (Gudachari 116). ఇందులో జయలలిత (తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి) నాయిక. ఆమె సరసన నటించడంతో కృష్ణకు కోరుకున్న జయం కూడా లభించింది. ఆ తర్వాత జయలలిత(Jayalalitha)తోనే ‘నిలుపు దోపిడి’ చిత్రంలోనూ జతకట్టారు కృష్ణ. ఈ రెండు చిత్రాలూ నటుడిగా కృష్ణకు గుర్తింపు తెచ్చినవే.

Jayalalitha.jpg

ఇక కృష్ణ నట జీవితాన్నే కాదు.. నిజ జీవితాన్ని కూడా ఓ మలుపుతిప్పిన చిత్రం ‘సాక్షి’ (Sakshi). ఈ సినిమాలోనే కృష్ణ సరసన తొలిసారిగా నటించారు విజయనిర్మల (Vijaya Nirmala). ఆర్టిస్టుగా ‘సాక్షి’ చిత్రం కృష్ణకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో కథానుగుణంగా కృష్ణను విజయనిర్మల ధైర్యం చేసి పెళ్లి చేసుకోవడం యాదృచ్చికమే అయినా నిజ జీవితంలోనూ అదే జరగడం విశేషం. 50 చిత్రాల్లో కృష్ణ సరసన విజయనిర్మల కథానాయికగా నటించారు.

Nirmala.jpg

1966లో వీరిద్దరి పెళ్లి జరిగినప్పటి నుంచి 1970 మధ్య వరకు తొమ్మిది చిత్రాల్లో కృష్ణ, విజయనిర్మల జంట ప్రేక్షకులను కనువిందు చేసింది. 1970లో కృష్ణ 15 చిత్రాల్లో నటిస్తే.. వాటిల్లో 11 సినిమాల్లో విజయనిర్మల కథానాయిక కావడం విశేషం. అలా ఆరంభంలోనే కృష్ణకు ‘జయ’, ‘విజయ’ అనే పేర్లు కలిసి వచ్చాయి. ఆ తర్వాత ‘జయ’ నామధేయంతో వచ్చిన జయప్రద (Jayapradha), జయసుధ (Jayasudha), జయచిత్ర (Jaya Chitra) కూడా కృష్ణ సరసన నటించి ప్రేక్షకులని అలరించారు.

Jayapradha.jpg

ఈ జైత్రయాత్రలో మరో ‘విజయ’ ఎవరంటే..

ఇక కృష్ణతో జోడీకట్టి ఆకట్టుకున్న మరో ‘విజయ’ ఎవరంటే విజయశాంతి (Vijayashanti). విజయనిర్మల, దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘కిలాడీ కృష్ణుడు’ (Khiladi Krishnudu) చిత్రంతోనే విజయశాంతి కథానాయికగా పరిచయమయ్యారు. విజయశాంతికి దక్కిన మరో అవకాశం ఏమిటంటే.. కృష్ణ సరసన నటించడమే కాకుండా ఆయన దర్శకత్వంలో రెండు చిత్రాల్లో కూడా ఆమె నటించింది. అంతేకాదు, బాపు (Bapu) దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణావతారం’ (Krishnavataram) చిత్రంలో కృష్ణకి చెల్లెలిగా కూడా విజయశాంతి నటించింది. ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘నాగాస్త్రం’, ‘ఒసేయ్ రాములమ్మా’ వంటి చిత్రాలలో కృష్ణతో కలిసి నటించిన విజయశాంతి.. ఆయనని తన అభిమాన నటుడిగా పలు సందర్భాలలో ప్రస్తావించారు.

agin.jpg

అంతగా అభిమానించే సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇక లేరనే వార్త తెలిసి విజయశాంతి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. మహేష్ బాబుకు, కృష్ణ కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు.

- వినాయకరావు

Updated Date - 2022-11-15T22:42:10+05:30 IST