పోలీస్ సేవల్లో కరీంనగర్ కమిషనరేట్‌కు ప్రథమ స్థానం
ABN , First Publish Date - 2022-10-30T00:28:22+05:30 IST
బ్లూకోల్ట్స్, కమ్యునిటీ పోలీసింగ్ తదితర విభాగాల్లో అత్యున్నత సేవలు అందించిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

కరీంనగర్ క్రైం, అక్టోబరు 29: బ్లూకోల్ట్స్, కమ్యునిటీ పోలీసింగ్ తదితర విభాగాల్లో అత్యున్నత సేవలు అందించిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరులో వేగం పెంచి, తెలంగాణ ప్రజలకు సకాలంలో సత్వరమైన ఏకీకృత సేవలందించే లక్ష్యంతో డీజీపీ మహేందర్‌రెడ్డి పలు విభాగాలను ఏర్పాటు చేశారు. ఆ విభాగాల పనితీరు కొలమానానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రతి నెల ఆ విభాగాల పనితీరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సమావేశంలో పరిశీలించి వారిలో అత్యుత్తమమైన సేవలందించిన జిల్లాలను, విభాగాలను కమిషనర్లను ఎంపిక చేస్తున్నారు. ఆ విధంగా బ్లూకోల్ట్ నుంచి మొదలుకొని కమ్యూనిటీ పోలీసింగ్ వరకు 18 విభాగాలను ఏర్పాటు చేశారు. బ్లూకోల్ట్స్‌తోపాటు 12 విభాగాల్లో కరీంనగర్ కమిషనరేట్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు పోలీసు అధికారులను పోలీస్‌కమిషనర్ వి సత్యనారాయణ అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.