CM Jagan : జగన్ ప్రసంగంపై సొంత పార్టీ నేతల విస్మయం
ABN , First Publish Date - 2023-03-25T14:07:39+05:30 IST
నేడు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జగన్ ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు.
ఏలూరు : నేడు (శనివారం) ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. దెందులూరులో వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ స్పీచ్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎప్పుడు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడే జగన్.. నేడు మాత్రం ఎలాంటి విమర్శలు లేకుండా తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళల పరిస్థితిని మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు. జగన్ ప్రసంగం తీరుపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్ అయి ఉండవచ్చని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరిట అధికారుల అత్యుత్సాహం ఆగడం లేదు. జగన్ పర్యటన నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి మరీ ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులను డ్వాక్రా మహిళలను తరలించేందుకు వినియోగించారు. అది చాలదన్నట్టుగా.. సీఎం సభా ప్రాంగణానికి దూరంగా ఉన్న 40 తాటిచెట్లను నరికేశారు. అంతేనా.. ఆయకట్టు పొలాల నుంచి వచ్చే మురుగునీటిని కొల్లేరుకు తీసుకువెళ్లే ప్రధాన కాలువలను పలు ప్రాంతాల్లో పూడ్చివేశారు. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. సీఎం సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్న వంతెనకు సైతం వైసీపీ రంగులు పూశారు.