Gidugu Rudraraju: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుంది
ABN , First Publish Date - 2023-06-14T16:59:25+05:30 IST
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మీడియాతో
విజయవాడ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికాలో రాహుల్ టూర్ విజయవంతంగా సాగింది. అడుగడుగునా ఎన్‌ఆర్ఐలు రాహుల్‌కు బ్రహ్మరథం పట్టారు. తెలుగు ప్రజలు అత్యధికంగా రాహుల్ (Rahul Gandhi) పర్యటనలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బషీర్‌బాగ్ ఘటనలో నేను లాఠీ దెబ్బలు తిన్నాను. చంద్రబాబు (Chandrababu) హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఉద్యమించాం. ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీగా ఆందోళనకు సిద్ధమవుతున్నాం. ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1350 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఛార్జీల బాదుడు బాదుతున్నారు. 500 యూనిట్ల దాకా చార్జీలు వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుంది. వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే తనయుడు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. విద్యుత్ ఛార్జీలపై రేపు విజయవాడలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తాం.’’ అని వెల్లడించారు.
‘‘కడపలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న జగన్.. నాలుగేళ్లయినా ఏం చేశారు. పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అమిత్ షా ఎందుకు నోరుమెదపలేదు. ఏపీ సమస్యలు ప్రస్తావించకుండానే 20 సీట్లు వస్తాయనడం సిగ్గుచేటు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల ముఖ్యమా?.. పవన్, చంద్రబాబు, జగన్‌కు సొంత ప్రయోజనాల ముఖ్యమా? బీజేపీ ప్రభుత్వం జగన్, చంద్రబాబుతో దొంగాట ఆడుతున్నారు. ఏపీలో బీజేపీ బలమెంతో?.. ఎవరితో కలుస్తారో ప్రకటించాలి.’’ అని రుద్రరాజు డిమాండ్ చేశారు.