GVL: భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన..
ABN , First Publish Date - 2023-02-16T10:46:04+05:30 IST
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు (GVL Narasimha Rao) గురువారం ఉదయం బందర్‌రోడ్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
విజయవాడ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీయల్ నరసింహారావు (GVL Narasimha Rao) గురువారం ఉదయం బందర్‌రోడ్‌లో వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్ (Parliament)లో ప్రస్తావించానన్నారు. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన అని, మూడేళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారని కొనియాడారు.
రాజకీయాలు అనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కాదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా... మిగిలినవారి పేర్లు కనిపించవా..? అని ప్రశ్నించారు. ఎదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా?... సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని జీవీయల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల పార్లమెంట్‌లో వంగవీటి రంగా గురించి జీవీఎల్ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రంగాను కొన్ని వర్గాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావిస్తారని అన్నారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రంగా మరణించి 36 ఏళ్లు అయినా..ఇప్పటికీ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారని, పేద, బడుగు, బలహీన వర్గాలు ఆరాధ్య దైవంగా కొలుస్తారని వివరించారు. రంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ గొప్ప ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు లభించిందని జీవీఎల్ వివరించారు.