NIA Court: కోడికత్తి కేసు విచారణ ఈనెల 20కి వాయిదా
ABN , First Publish Date - 2023-04-17T15:50:19+05:30 IST
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
విజయవాడ: కోడికత్తి కేసు (KodiKatti Case) విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు (NIA Court) ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ రోజు ఉదయం ఎన్ఐఏ కోర్టు ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్లపై న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ వెయ్యనందున సామాన్యూలు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు. స్టేట్ పోలీస్‌లు రిలీజ్ చేసిన ఫ్లెక్సీ... నిందితుడు వైసీపీ సింపతైజర్ అని చెప్పేందుకు కావాలనే ప్రయత్నించారన్నారు. నిందితుడి కుటుంబానికి జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం కూడా సాంక్షన్ అయిందని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, టీడీపీతో సంబంధాలు ఉన్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఎలా ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయన్నారు. అలాగే ఆపరేషన్ గరుడ అంశాన్ని జగన్ తరపు న్యాయవాది తన వాదనలో ప్రస్తావించారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుంది అంటూ వాదనలు వినిపించారు.
ఈ కుట్రను ఎన్ఐఏ ఎందుకు వెలికితీయలేదు...
సాక్ష్యం నమోదుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించారు. కోడి కత్తి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 23 రోజుల్లోనే ఎన్ఐఏ అభియోగం పత్రం దాఖలు చేసిందని.. అయితే అంత తొందరగా అభియోగం పత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 39 మంది సాక్షులను 5 రోజులోనే విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేశారన్నారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యాలను విచారించారని... మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని తెలిపారు. ఛార్జిషీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి అర్ధమవుతుందని చెప్పారు. జగన్ వాగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారన్నారు. నిందుతుడు శ్రీనును హర్షవర్ధన్ పథకం ప్రకారమే రెస్టారెంట్లోకి తీసుకెళ్లారని తెలిపారు. నిందితుడి గ్రామంలో ఫ్లెక్సీపై గరుడ ఫోటో ఎందుకు వచ్చిందని జగన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఒక ఫ్లెక్సీ ద్వారా నిందితుడు వైసీపీ సానుభూతిపరుడు అనే కంక్లుషన్కు ఎలా వస్తారన్నారు. నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు తను టీడీపీ పార్టీ అభిమానిని అని చెప్పుకున్నారు అంటూ ప్రస్తావించారు. సరైన విచారణ జరగాలని కోరుకోవడం భాడితునికి వున్న హక్కు అని తెలిపారు. నిందితుడు మెడ మీద పొడవాలనుకున్నాడు అని ఎన్ఐఏ తన కౌంటర్లో పేర్కొందని.. అంటే లైఫ్ తియ్యలనీది దీని వెనుక ఉన్న బలమైన అంశమన్నారు. దీని వెనుక కుట్ర ఉన్నట్టే కదా.. ఎందుకు ఎన్ఐఏ ఈ కుట్రను వెలికి తీయలేదని వెంకటేశ్వర్లు వాదించారు. ఎన్ఐఏ సమగ్ర విచారణ చేసింది అనడానికి ఆధారంగా ఉండే వస్తువులను, ఫ్లెక్స్ని అధికారులు.. న్యాయమూర్తి ముందు ప్రదర్శించారు.
నిందితుడికి రెండు ఈ మెయిల్స్ ఉన్నాయని.. వాటిని దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదన్నారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉందని... విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి దాడికి దాన్ని ఎంపిక చేసుకున్నారన్నారు. ముమ్మిడివరంలో ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలంలో ఫ్లెక్సీ ఐదు ముక్కులు చేసి ఉందని చెప్పారని.. ఆ విషయాన్ని దర్యాప్తు అధికారులు విస్మరించారని జగన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ తనిఖీ చేసిన తర్వాతే రెస్టారెంట్లోకి ఉద్యోగులను అనుమతిస్తారని ని హర్షవర్ధన్ చెప్పారని.. ఈ పాయింట్‌ను ఎన్ఐఏ పట్టించుకోలేదని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. కాగా.. తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఎన్ఐఏ కోర్టు ఈనెల 20కు వాయిదా వేసింది.