Buggana Rajendranath Reddy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై వారిద్దరితో చర్చకు సిద్ధం.... బుగ్గన సవాల్
ABN , First Publish Date - 2023-06-16T10:53:23+05:30 IST
సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యలు చేశారు. పాలన రాకపోతే గడచిన నాలుగేళ్లుగా పన్ను వసూళ్లు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రహదారులు అన్ని బాగుంటే ఎక్కడో దెబ్బ తిన్న ఒక్క రోడ్డు గురించి మీడియా రాస్తోందని మండిపడ్డారు. గతంలో కంటే మెరుగ్గా రహదారులపై ప్రభుత్వం వ్యయం చేస్తోందన్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యం అయ్యాయి అంతే అని చెప్పుకొచ్చారు. కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కడా సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, యనమల తలో మాట మాట్లాడుతున్నారని.. ఆర్థిక పరిస్థితిపై వారిద్దరితోనూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని.. టీడీపీ ఇచ్చిన హామీలు ఊచితాలు కావా తమకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
వాణిజ్య పన్నుల శాఖలోనూ సంస్కరణలు...
బుగ్గన ఇంకా మాట్లాడుతూ... వాణిజ్య పన్నుల శాఖలోనూ చాలా సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ఇన్వర్ట్ పిరమిడ్ తరహాలో పాలన విధానం వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్నామన్నారు. పారదర్శకంగా నిర్ణయాలు అమలు కావాలనే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. పన్నుల చెల్లింపు రిజిస్ట్రేషన్, ఎన్ఫొర్సుమెంట్, ఆడిట్ లాంటి ప్రక్రియలు వేర్వేరుగా జరిగేట్టు చూస్తున్నామని చెప్పారు. వ్యక్తులపరంగా పొరపాట్లు జరగకూడదని ఈ తరహా విధానం అమలు చేశామన్నారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ కార్యాలయం ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రేడర్లు, డీలర్లు వెంటపడి పన్నులు కట్టించడం కంటే వారే స్వయంగా పన్నులు చెల్లించేలా చేస్తున్నామని తెలిపారు. రోడ్లపై వేధించే చర్యలు ఎక్కడా లేవన్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితేనే తనిఖీలు జరుగుతున్నాయన్నారు. డీలర్లను వేధించే చర్యలు లేవని.. 2022-23లో 28,103 కోట్లు పన్నులు ద్వారా వసూలు అయ్యిందని తెలిపారు. అంతకు ముందు ఏడాది 23,386 కోట్ల రూపాయలు వసూలు అయ్యిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.